సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!

- September 20, 2026 , by Maagulf
సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!

మనామా: సౌదీ అరేబియాపై హౌతీ మిలీషియా కొనసాగిస్తున్న దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. రియాద్‌తో పాటు బిష్, తాయిఫ్, ఫరాసాన్, యన్బు నగరాల్లో పౌరులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులకు ప్రయత్నించడం ఆందోళనకరమని పేర్కొంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అలాగే సంబంధిత యూఎన్ భద్రతా మండలి తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని బహ్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది.

సౌదీ అరేబియాకు బహ్రెయిన్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. దేశ సార్వభౌమత్వం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంతో పాటు పౌరులు, నివాసితుల రక్షణ కోసం సౌదీ తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలిపింది. యూఎన్ చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. సౌదీ భద్రత, స్థిరత్వం బహ్రెయిన్ జాతీయ భద్రతలో అంతర్భాగమని బహ్రెయిన్ స్పష్టం చేసింది. హౌతీలు రియాద్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేసిన రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ దళాల సామర్థ్యాలను కూడా ప్రశంసించింది.

హౌతీల దాడులను నిలిపివేసేందుకు యూఎన్ భద్రతా మండలి తన బాధ్యతలను నిర్వర్తించాలని బహ్రెయిన్ మరోసారి కోరింది. సౌదీలోని పౌరులు, పౌర మౌలిక వసతులపై దాడులకు బాధ్యులను జవాబుదారీ చేయాలని, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయాలని కోరింది. ముఖ్యంగా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం 2216ను అమలు చేయాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com