యన్బు చమురు కేంద్రాలపై హౌతీల దాడి వీడియే ఫేక్..!!

- September 21, 2026 , by Maagulf
యన్బు చమురు కేంద్రాలపై హౌతీల దాడి వీడియే ఫేక్..!!

రియాద్‌: సౌదీ అరేబియాలోని యన్బు చమురు కేంద్రాలపై ఇటీవల హౌతీలు దాడి చేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో తప్పుడు ప్రచారంగా తేలింది. ఆ వీడియోలో కనిపిస్తున్న మంటలు, దట్టమైన పొగకు యన్బులో జరిగిన తాజా ఘటనకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధారణ అయింది. వైరల్ అవుతున్న వీడియో వాస్తవానికి సుమారు ఐదేళ్ల క్రితం దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టులో జరిగిన పారిశ్రామిక అగ్ని ప్రమాదానికి సంబంధించినదని గుర్తించారు.

2021 నాటి వీడియో

వీడియోను పరిశీలించిన అనంతరం ఇది జూలై 2021లో జరిగిన ఘటనకు సంబంధించినదిగా గుర్తించారు. ఆ సమయంలో జెబెల్ అలీ పోర్టులో ఓ నౌకలోని కంటైనర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను అప్పట్లో దుబాయ్ మీడియా కార్యాలయం కూడా విడుదల చేసింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అప్పట్లో అధికారులు తెలిపారు.

 యన్బు దాడి అంటూ తప్పుడు ప్రచారం

సెప్టెంబర్‌ 19న హౌతీ గ్రూప్‌ యన్బులోని అరామ్‌కోకు చెందిన ఓ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించిన సమయంలోనే ఈ పాత వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అదే సమయంలో యెమెన్‌లోని చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సౌదీ నేతృత్వంలోని కూటమి.. యన్బుతో పాటు పలు నగరాలను లక్ష్యంగా చేసుకున్న దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పాత దుబాయ్ వీడియోను యన్బు దాడికి సంబంధించినదిగా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవ నిర్ధారణలో వైరల్ వీడియో సౌదీ అరేబియాకు చెందినది కాదని, యన్బులో జరిగిన తాజా ఘటనను చూపించదని స్పష్టమైంది. అది 2021లో దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టులో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పాత వీడియో అని నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com