ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!

- September 21, 2026 , by Maagulf
ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!

న్యూ ఢిల్లీ: కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) సంచలన హెచ్చరిక జారీ చేసింది. ఇతరుల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి సిమ్‌ కార్డులు తీసుకోవడం, టెలికాం గుర్తింపులను దుర్వినియోగం చేయడం, అలాగే మొబైల్ ఐఎంఈఐ (IMEI) నంబర్లలో అక్రమంగా మార్పులు చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇటువంటి అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు ఏకంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఛత్తీస్‌గఢ్‌ లో దారుణ మోసం.. రంగంలోకి దిగిన డీఓటీ
ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన ఒక దారుణ మోసం ఆధారంగా కేంద్రం ఈ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ ఉన్న ఒక పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (PoS) ఏజెంట్‌.. స్థానిక ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా, వారి గుర్తింపు పత్రాలను ఉపయోగించి అక్రమంగా 25 సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే టెలికమ్యూనికేషన్స్‌ శాఖ, సంబంధిత మొబైల్‌ సేవల సంస్థలతో కలిసి వేగంగా చర్యలు చేపట్టింది. బాధ్యుడైన పీఓఎస్‌ ఏజెంట్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే కాకుండా, అతని షాప్ నుండి కొత్త మొబైల్‌ కనెక్షన్లు జారీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించింది.

డీఐపీ (DIP) ద్వారా రీ-వెరిఫికేషన్
మోసపూరితంగా పొందిన ఆ 25 మొబైల్‌ నంబర్లను టెలికం శాఖ ‘డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌’ (DIP) ద్వారా సమగ్రంగా పరిశీలించింది. అనుమానాస్పదంగా ఉన్న కనెక్షన్లకు సంబంధించి వినియోగదారులకు రీ-వెరిఫికేషన్ (మళ్లీ ధ్రువీకరణ) చేపట్టింది. ఈ క్రమంలో సరైన ధ్రువీకరణ ఆధారాలు చూపించని సిమ్‌ కార్డులను వెంటనే డీయాక్టివేట్‌ చేసి బంద్ చేశారు. భవిష్యత్తులోనూ ఎవరైనా ప్రజల అనుమతి లేకుండా వారి ఐడీ పత్రాలను దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఓటీ తేల్చిచెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com