బహ్రెయిన్‌లో పౌరసంఘాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

- September 21, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో పౌరసంఘాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

మనామా: సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు నిర్వహించకుండా, జనరల్‌ అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించని పలు రిజిస్టర్డ్‌ పౌరసంఘాలను తప్పనిసరిగా రద్దు చేయాలని బహ్రెయిన్‌ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. చాలా కాలంగా కార్యకలాపాలు నిలిపివేసిన పౌరసంఘాల పనితీరుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

చర్యలు తీసుకునే ముందు ఆయా సంస్థలకు తమ స్థితిగతులను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్స్‌ సపోర్ట్‌ డైరెక్టరేట్‌ను సంప్రదించి, రికార్డులను అప్‌డేట్‌ చేయడంతో పాటు అవసరమైన చట్టపరమైన, నియంత్రణపరమైన ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న కొన్ని సంస్థలు తమ స్థితిని సరిదిద్దుకోవడం ప్రారంభించి, అవసరమైన నిబంధనలను పూర్తి చేశాయి. అయితే మరికొన్ని సంస్థలు మాత్రం గడువు ముగిసిన తర్వాత కూడా స్పందించకుండా, కార్యకలాపాలు కొనసాగించలేదని పేర్కొన్నది.  దీంతో సామాజిక అభివృద్ధి మంత్రి ఉసామా బిన్ సాలెహ్ అల్ అలావీ 2026లోని కేబినెట్ డిసిషన్ నంబర్‌ (57)ను జారీ చేశారు. సమీక్ష ప్రక్రియ పూర్తయిన సంస్థలను తప్పనిసరిగా రద్దు చేయాలని అందులో ఆదేశించారు.

ఇకపై కూడా యాక్టివ్ గా లేని సంస్థలపై సమీక్ష కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అవసరాన్ని బట్టి వర్తించే చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. రద్దు నిర్ణయం పరిధిలోకి వచ్చిన సంస్థలకు సంబంధించి లిక్విడేషన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించి, రద్దు అనంతరం అవసరమైన అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది.

బహ్రెయిన్‌లోని పౌరసమాజ రంగాన్ని మరింత సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించడం ఈ చర్యల లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజిస్టర్‌ అయిన సంస్థలు యాక్టివ్ గా ఉండటంతో పాటు, అవి ఏర్పాటైన లక్ష్యాలు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా చూడటమే ఉద్దేశమని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com