ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక

- September 21, 2026 , by Maagulf
ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక

వాషింగ్టన్: ఇరాన్‌కు చెందిన విమానయాన సంస్థలపై అమెరికా మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్‌కు చెందిన విమానాలు ఇతర దేశాల విమానాశ్రయాల్లో సేవలు పొందకుండా చేయడానికి, వాటికి ఇంధనం, ల్యాండింగ్ సేవలు లేదా టికెట్ల విక్రయానికి సహకరించే సంస్థలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.

సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆంక్షల అమలు మరింత కఠినతరం కానున్నట్లు బెసెంట్ పేర్కొన్నారు. ఇరాన్ విమానయాన రంగానికి సహకరించే సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో తమ కార్యకలాపాలను కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

ఇరాన్ విమానయాన రంగంపై అమెరికా ఇప్పటికే చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 8న అమెరికా ట్రెజరీ శాఖ 36 సంస్థలు, వ్యక్తులు, ఇతర లక్ష్యాలపై ఆంక్షలు విధించింది. ఇందులో మిగిలిన ఇరాన్ విమానయాన సంస్థలు, అలాగే వాటికి సేవలు అందిస్తున్న మూడో దేశాల సంస్థలు ఉన్నాయి.

ఇరాన్ విమానయాన రంగం ఆయుధాలు, సిబ్బంది, అక్రమ సరుకుల రవాణాకు ఉపయోగపడుతోందన్న ఆరోపణలతో అమెరికా ఈ చర్యలు చేపట్టింది. ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్కు సేవలు అందించే విదేశీ సంస్థలపైనా చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ట్రెజరీ వెల్లడించింది.

చైనాతో కూడా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని బెసెంట్ తెలిపారు. చైనా ఆర్థిక అధికారులు, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గోంగ్‌షెంగ్తో అమెరికా చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com