‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- September 22, 2026
దోహా: ఖతార్‌పై ‘ది న్యూయార్కర్’ సెప్టెంబర్ 19న ప్రచురించిన కథనంలో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం (International Media Office) పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ది న్యూయార్కర్’ కథనంలోని ఆరోపణలు ఫేక్, కల్పిత సమాచారంపై ఆధారపడి ఉన్నాయని ఖతార్ తెలిపింది. తమపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.
కథనం ప్రచురణకు ముందు ‘బ్లాస్ట్ డాక్యుమెంట్స్’తో పాటు, కథనంలోని ఆరోపణలకు ఆధారంగా చూపిన ఇతర పత్రాలు నకిలీవని నిరూపించే స్పష్టమైన ఆధారాలను ‘ది న్యూయార్కర్’కు అందించినట్లు ఖతార్ వెల్లడించింది. అయినప్పటికీ ఆ కథనాన్ని ప్రచురించడం ఆ సంస్థ సంపాదకీయ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొంది. ఇలాంటి పత్రాలు గతంలోనూ కొన్ని మీడియా సంస్థలకు చేరాయని, అవి నకిలీవని ఆధారాలు అందించిన అనంతరం సంబంధిత సంస్థలు వాటిపై కథనాలు ప్రచురించలేదని ఖతార్ తెలిపింది.
ప్రస్తుతం ‘ది న్యూయార్కర్’ మాత్రం ఆ పత్రాలకు విశ్వసనీయత కల్పించిందని, ఇది ఖతార్‌ను లక్ష్యంగా చేసుకున్న విస్తృతమైన తప్పుడు సమాచార ప్రచారంలో భాగమని ఆరోపించింది. ఇజ్రాయెల్‌లోని తీవ్రవాద భావజాలానికి చెందిన కొన్ని వర్గాలు సహా వివిధ పక్షాలు కొన్నేళ్లుగా ఖతార్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేలా నకిలీ పత్రాలను రూపొందించి, వాటిని మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాయని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఖతార్ పేర్కొంది.
హమాస్‌కు నిధుల ఆరోపణలపై ఖండన
ఖతార్ హమాస్‌కు నిధులు అందించిందన్న ఆరోపణలను కూడా ఆ దేశం ఖండించింది. గాజాలోని పాలస్తీనా పౌరులకు మాత్రమే తమ సహాయం అందించామని, ఈ సహాయ కార్యక్రమాలు ఇజ్రాయెల్ అధికారులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో సమన్వయంతో జరిగాయని తెలిపింది. గతంలో అమలైన సహాయ వ్యవస్థల ప్రకారం నగదు సహాయంతో పాటు ఆహారం, మందులు, ఇంధనం వంటి వస్తువులు ఇజ్రాయెల్ మీదుగా గాజాలోకి చేరాయని ఖతార్ పేర్కొంది. ప్రతి దశలోనూ ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు తెలిపింది. వరుసగా అధికారంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రభుత్వాల హయాంలో, ఆ దేశ భద్రతా సంస్థల ప్రమేయంతోనే ఖతార్ సహాయం అందించిందని ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఏదైనా నిధులు హమాస్‌కు చేరి ఉంటే, దానికి ఖతార్‌కు సంబంధం లేదని తెలిపింది. ఆ సహాయ పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించిన ఇజ్రాయెల్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
మధ్యవర్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపణ
ఖతార్‌ను మధ్యవర్తిగా వ్యవహరించకుండా అడ్డుకునేందుకే తమపై తప్పుడు ఆరోపణలు కొనసాగుతున్నాయని ఆరోపించింది. ప్రాంతీయ శాంతి ప్రయత్నాలను అడ్డుకోవాలనుకునే వర్గాలు ఈ ప్రచారం వెనుక ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగించే తప్పుడు సమాచారంపై మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఖతార్ సూచించింది. సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ అంశాలపై వార్తలు ప్రచురించే సమయంలో సమాచారాన్ని క్షుణ్ణంగా ధృవీకరించడం, సమగ్ర విశ్లేషణ చేయడం మీడియా సంస్థల బాధ్యత అని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







