ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!

- September 23, 2026 , by Maagulf
ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!

జెడ్డా: మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలీషియా పదేపదే చేస్తున్న దాడి ప్రయత్నాలను సౌదీ అరేబియా రాజు సల్మాన్ తీవ్రంగా ఖండించారు. పవిత్ర స్థలాలపై ఇలాంటి చర్యలు వాటి పవిత్రతను ఉల్లంఘించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. జెడ్డాలో జరిగిన సౌదీ మంత్రివర్గ వీక్లీ సమావేశానికి రాజు సల్మాన్ అధ్యక్షత వహించారు.

సౌదీ అరేబియా జాతీయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 23న జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో గ్రాండ్ మసీదు, ప్రవక్త మసీదు, వాటిని సందర్శించే యాత్రికులకు సేవలందించే అవకాశం లభించడం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, పురోగతి, వివిధ రంగాల్లో విజయాలు కొనసాగాలని ఆకాంక్షించారు. దేశ రక్షణలో సైనిక, భద్రతా సిబ్బంది పోషిస్తున్న పాత్రను కూడా రాజు సల్మాన్ ప్రశంసించారు. పవిత్ర స్థలాలు, యాత్రికులు, సౌదీ పౌరులు, నివాసితులపై ఎలాంటి దాడులు జరిగినా వాటిని ఎదుర్కొంటున్న భద్రతా బలగాలను అభినందించారు.

క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఇటీవల ఈజిప్టులో చేపట్టిన పర్యటన ఫలితాలను మంత్రివర్గం సమీక్షించింది. ఈ సందర్భంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసితో క్రౌన్ ప్రిన్స్ జరిపిన చర్చల్లో ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించాలన్న ఉమ్మడి ఆకాంక్ష, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సంప్రదింపులు, సమన్వయం కొనసాగించాలన్న నిబద్ధత ప్రధానంగా చర్చకు వచ్చినట్లు వెల్లడించారు.

జోర్డాన్ రాజు అబ్దుల్లా పంపిన సందేశంతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో క్రౌన్ ప్రిన్స్ జరిపిన ఫోన్ సంభాషణ వివరాలను కూడా మంత్రివర్గం పరిశీలించింది. ప్రాంతీయ పరిణామాలు, స్థిరత్వాన్ని బలోపేతం చేసే చర్యలు, సముద్ర రవాణా, జలమార్గాల్లో స్వేచ్ఛ, భద్రత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపింది.
ప్రాంతీయ పరిణామాలపై చర్చించిన మంత్రివర్గం అంతర్జాతీయ చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, అంతర్జాతీయ జలమార్గాల్లో సురక్షిత నౌకాయానానికి హామీ ఇవ్వడం అవసరమని పేర్కొంది. దేశాల భద్రతను కాపాడటం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ సరఫరా వ్యవస్థలను రక్షించడం కోసం ఈ సూత్రాలు కీలకమని మంత్రివర్గం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com