UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- September 23, 2026
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వరుసగా ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో బహుపాక్షిక వ్యవస్థలో సంస్కరణలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సంస్కరణలతో పాటు కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్షం, ఆరోగ్య శాస్త్రాలు, ఇంధనం వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు.
భారత్–యూఏఈ–ఫ్రాన్స్ త్రైపాక్షిక భేటీ
మంగళవారం న్యూయార్క్‌లో భారత్–యూఏఈ–ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సు, అంతరిక్షం, ఆరోగ్య శాస్త్రాలు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చించారు.
మూడు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర అనుబంధ సామర్థ్యాలు సహకారానికి విస్తృత అవకాశాలను అందిస్తున్నాయని జైశంకర్ తెలిపారు. చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
G4 దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ
భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లతో కూడిన G4 దేశాల విదేశాంగ మంత్రులు కూడా న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహుపాక్షిక వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకతపై చర్చించారు.
ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా మరింత ప్రాతినిధ్యాత్మకంగా, స్పందించే విధంగా, సమర్థవంతంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరాన్ని వారు చర్చించారు. ఈ ఉమ్మడి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు G4 భాగస్వాములతో కలిసి భారత్ నిరంతరం పనిచేస్తుందని జైశంకర్ తెలిపారు.
నేపాల్‌తో ద్వైపాక్షిక అంశాల పై చర్చ
ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ కార్యాలయంలో నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్తోనూ జైశంకర్ సమావేశమయ్యారు. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలో జరిగిన గత సమావేశం తర్వాత భారత్–నేపాల్ మధ్య చోటుచేసుకున్న పరిణామాలను సమీక్షించారు.
అభివృద్ధి భాగస్వామ్యం, ఇంధన రంగంలో సహకారంలో సాధించిన పురోగతిపై ఇరువురు చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.
ఖతార్, ఫిలిప్పీన్స్, జర్మనీ ప్రతినిధులతో భేటీలు
యూఎన్జీఏ సందర్భంగా మరో బిజీ రోజును పూర్తి చేసిన జైశంకర్.. ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో సమావేశమయ్యారు. అలాగే ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యదర్శి మా. థెరిసా లాజారో, జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్తోనూ భేటీ అయ్యారు.
ఈ సమావేశాల్లో కొనసాగుతున్న ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. G4 భాగస్వాములుగా ఐక్యరాజ్యసమితి, ఇతర బహుపాక్షిక వేదికల్లో భారత్–జర్మనీ సహకారం బలంగా కొనసాగుతోందని జైశంకర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







