దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- September 25, 2026
దుబాయ్: దుబాయ్‌లో నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న షేర్డ్ హౌసింగ్‌లో నివసించే వారికి కొత్త చట్టం కీలక వెసులుబాటు కల్పిస్తోంది. లీజు గడువు పూర్తికాకముందే అద్దె ఒప్పందాన్ని ముగించుకుని, ముందుగానే చెల్లించిన అద్దెలో మిగిలిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు అవకాశం కల్పించారు. దుబాయ్ కొత్త షేర్డ్ హౌసింగ్ చట్టం Law No. 4 of 2026 ప్రకారం, నివాసి లీజు కాలంలో ఎప్పుడైనా ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. అయితే, యజమానికి ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.
చట్టం ప్రకారం కనీస నోటీసు కాలం 30 రోజులు. అయితే, అద్దె ఒప్పందంలో అంతకంటే ఎక్కువ నోటీసు కాలాన్ని పేర్కొంటే అదే అమలవుతుంది. ఉదాహరణకు.. ఒప్పందంలో 60 రోజుల నోటీసు ఇవ్వాలని ఉంటే, నివాసి 60 రోజుల ముందుగానే యజమానికి సమాచారం ఇవ్వాలి.
ఎంత అద్దె తిరిగి వస్తుంది?
చట్టబద్ధమైన నోటీసు ప్రకారం ఒప్పందాన్ని ముగించిన నివాసి ముందుగానే చెల్లించిన అద్దెను తిరిగి ఇవ్వాలని యజమానిని కోరవచ్చు. అయితే, ముందస్తుగా చెల్లించిన మొత్తంలో నుంచి ఒక నెల అద్దెను యజమాని మినహాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని నివాసికి తిరిగి చెల్లించాలి. ముఖ్యంగా కొన్ని నెలల అద్దెను ఒకేసారి ముందుగానే చెల్లించిన వారికి ఈ నిబంధన ఉపయోగపడే అవకాశం ఉంది.
నీరు, విద్యుత్ ఛార్జీలు కూడా..
కొత్త నిబంధనల ప్రకారం సాధారణంగా షేర్డ్ హౌసింగ్‌కు అద్దెను నెలవారీగా ముందుగానే చెల్లించాలి. అయితే, యజమాని-నివాసి పరస్పరం వేరే విధంగా అంగీకరించుకోవచ్చు. అలాగే, ఒప్పందంలో వేరుగా పేర్కొనకపోతే విద్యుత్, నీటి ఛార్జీలు అద్దెలోనే చేర్చబడతాయి.
రీఫండ్ ఇవ్వకపోతే ఏం చేయాలి?
రీఫండ్ కోరుతూ యజమానికి సమాచారం ఇచ్చిన తర్వాత 30 రోజుల్లోపు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి పొందకపోతే, నివాసి రికవరీ కోసం Execution Judge వద్ద పిటిషన్ దాఖలు చేయవచ్చు. షేర్డ్ హౌసింగ్ చట్టం కింద ఏర్పడే హక్కులు, బాధ్యతలకు సంబంధించిన వివాదాలపై Rental Disputes Centreకు ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది.
నోటీసు ఎలా ఇవ్వాలి?
భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా నోటీసును చట్టబద్ధంగా గుర్తించిన మార్గాల్లో ఇవ్వడం ముఖ్యం.
నోటీసును:
- నోటరీ పబ్లిక్ ద్వారా
- అద్దె ఒప్పందంలో నమోదు చేసిన ఈ-మెయిల్ ద్వారా
- వ్యక్తిగతంగా అందజేయడం ద్వారా
- చట్టబద్ధంగా అనుమతించిన ఇతర మార్గాల్లో ఇవ్వవచ్చు. కేవలం మాటల ద్వారా యజమానికి సమాచారం ఇవ్వడంపై ఆధారపడకుండా, గుర్తింపు పొందిన పద్ధతిలో నోటీసు ఇచ్చినట్లు ఆధారం ఉంచుకోవడం మంచిది.
ఇల్లు అమ్మేస్తే లీజు రద్దవుతుందా?
షేర్డ్ హౌసింగ్ నివాసులకు మరో ముఖ్యమైన రక్షణను కూడా చట్టం కల్పిస్తోంది. ఆస్తి యాజమాన్యం మారినంత మాత్రాన ప్రస్తుత అద్దె ఒప్పందం ఆటోమేటిక్‌గా రద్దు కాదు. ఇల్లు కొత్త యజమానికి బదిలీ అయినా, ఇప్పటికే ఉన్న అద్దె ఒప్పందం కొనసాగుతుంది. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం నివాసి అక్కడ కొనసాగవచ్చు. షేర్డ్ హౌసింగ్ ఒప్పందంలో అద్దె కాలవ్యవధి స్పష్టంగా పేర్కొనాలి. చట్ట ప్రకారం రద్దు చేయకపోతే, నిర్ణయించిన గడువు వరకు ఒప్పందం అమల్లో ఉంటుంది.
షేర్డ్ హౌసింగ్‌కు కొత్త నిబంధనలు
దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు కొత్త చట్టం ద్వారా అనుమతులు, రిజిస్టర్డ్ అద్దె ఒప్పందాలు, నివాసుల సంఖ్యకు సంబంధించిన ప్రమాణాలు, యజమానులు, అనుమతిపొందిన సంస్థలు, నివాసుల హక్కులు-బాధ్యతలకు సంబంధించిన నిబంధనలు తీసుకొచ్చారు. కొత్త లైసెన్సింగ్ విధానాలు, అవసరమైన వివరాలను దుబాయ్ మునిసిపాలిటీ దశలవారీగా అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







