దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- September 26, 2026
దుబాయ్: నివాసితుల భద్రతను కాపాడటంతో పాటు నగరంలోని నివాస ప్రాంతాల క్రమబద్ధతను పరిరక్షించేందుకు దుబాయ్ మున్సిపాలిటీ తనిఖీలను ముమ్మరం చేసింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు దుబాయ్‌లోని వివిధ నివాస ప్రాంతాల్లో 16వేలకు పైగా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భవనాల నిర్మాణాలు, వాటి వినియోగం, నివాసుల ఆక్యుపెన్సీకి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలను అధికారులు పరిశీలించారు.
అల్ వర్ఖాపై ప్రత్యేక దృష్టి
దుబాయ్‌లోని అల్ వర్ఖా ప్రాంతంలో 800కు పైగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా భవనాల వినియోగం, అనధికార ఆక్యుపెన్సీ, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. మొత్తంగా దుబాయ్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 2,395 ఉల్లంఘనలు గుర్తించారు. పెండింగ్‌లో ఉన్న ఉల్లంఘనలను నిర్దేశించిన గడువులోగా సరిదిద్దే వరకు పర్యవేక్షణ కొనసాగిస్తామని దుబాయ్ మున్సిపాలిటీ తెలిపింది.
తనిఖీల్లో ప్రధానంగా అనుమతి లేని ప్రాంతాల్లో బ్యాచిలర్లకు వసతి కల్పించడం, ఒకే నివాస యూనిట్‌లో అనేక కుటుంబాలు నివసించడం, అవసరమైన అనుమతులు లేకుండా నిర్మాణాలు లేదా భవనాల్లో మార్పులు చేయడం వంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి కేసును దాని స్వభావం, పరిసరాలపై చూపే ప్రభావం ఆధారంగా ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. నివాసితులు లేదా చుట్టుపక్కల భవనాల భద్రతకు ముప్పు కలిగించే ఉల్లంఘనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భవన యజమానులకు కీలక సూచనలు
నివాస భవనాలు, విల్లాలను ఆమోదించిన వినియోగ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉపయోగించాలని దుబాయ్ మున్సిపాలిటీ భవన యజమానులను కోరింది. అనుమతి లేని ప్రాంతాల్లో బ్యాచిలర్లు లేదా బహుళ కుటుంబాలకు ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని సూచించింది. అలాగే, భవనాల్లో నిర్మాణ పనులు లేదా మార్పులు చేపట్టే ముందు అవసరమైన అనుమతులు, ఆమోదాలు తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేసింది. భవనాల్లో నివాసుల సంఖ్య, ఆక్యుపెన్సీ కూడా సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది.
ప్రజల సహకారం కోరిన మున్సిపాలిటీ
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై ప్రజలు దుబాయ్ మున్సిపాలిటీ అధికారిక ఛానళ్ల ద్వారా సమాచారం అందించాలని అధికారులు కోరారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారంతో ఉల్లంఘనలను వేగంగా గుర్తించి చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. దుబాయ్ మున్సిపాలిటీ బిల్డింగ్ రెగ్యులేషన్ అండ్ పర్మిట్స్ ఏజెన్సీ సీఈఓ **మర్యం అల్ ముహైరి** మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడం, భద్రతను కాపాడటం, నివాస ప్రాంతాల పట్టణ స్వరూపాన్ని పరిరక్షించడం తమ లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ







