కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి

- September 26, 2026 , by Maagulf
కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి

 సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిక్విట్ నగరం నుండి రాజధాని కిన్షాసా వైపు ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సాంకేతిక లోపం కారణంగా హఠాత్తుగా కుప్పకూలిపోయింది. కిన్షాసాకు తూర్పున ఉన్న కెంగే ప్రాంత సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. విమానం నేలను తాకగానే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు సహా మొత్తం 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని కాంగో ఆర్మీ అధికారిక ప్రకటనలో ధృవీకరించింది.

ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణం: దర్యాప్తునకు ఆర్మీ ఆదేశం

విమానం గాల్లో ఉండగానే తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తిందని, దాన్ని నియంత్రించేందుకు పైలట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్నాయి. విమాన శకలాలు కాలిన బూడిదగా మారడంతో సహాయక చర్యలు కూడా తీవ్ర సవాలుగా మారాయి. ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు కాంగో మిలిటరీ అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. కాంగోలో కాలం చెల్లిన విమానాలు, సరైన నిర్వహణ లేకపోవడం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిలిటరీ విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com