ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్

- September 26, 2026 , by Maagulf
ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ: విజయవాడలోని డీవీ మేనర్‌ హోటల్‌ వేదికగా శనివారం ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి, ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్ కందుల దుర్గేష్ హాజరై, కూటమి నాయకులతో భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, మక్కెన మల్లిఖార్జున రావు, గద్దె అనురాధ, జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు, శ్రీకాంత్, బండి కోమలి, అలాగే బీజేపీ నేతలు అడ్డూరి శ్రీరామ్, ఉప్పలపాటి శ్రీనివాసరావు తదితర ప్రముఖ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రతి స్థానంలోనూ విజయఢంకా మోగించాలని, వంద శాతం స్ట్రైక్ రేట్‌ సాధించడమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని కూటమి నేతలే నిర్ణయించారు.కూటమి తరఫున బరిలో నిలిచే ఏ అభ్యర్ధినైనా గెలిపించేందుకు నాయకులందరూ అంకితభావంతో పనిచేయాలని, స్థానిక పరిస్థితులకు తగినట్లుగా పకడ్బందీ వ్యూహాలను రచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి ఓటర్ల మద్దతు కూడగట్టాలని సూచించారు. అంతిమంగా ఎన్నిక ఏదైనా సరే, కూటమి జెండా ఎగరాలని, ఎలాంటి పొరపొచ్చాలకు తావులేకుండా ఐకమత్యంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com