ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు

- October 04, 2026 , by Maagulf
ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు

హైదరాబాద్: వారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షిక ఉపన్యాసం, బహుమతుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో శనివారం (అక్టోబర్ 3) ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ, చురుకైన భాగస్వామ్యం, విజయాలను గుర్తించి వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి డా. మోహన్ కందా (IAS, రిటైర్డ్) 2013లో ‘వారధి’ని స్థాపించారు. ‘వారధి’ అంటే వంతెన అని అర్థం. వ్యక్తులు, సంస్థలు, సమాజాల మధ్య అనుసంధానాన్ని ఏర్పరచడంతో పాటు అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలకు వేదికగా ఫౌండేషన్ పనిచేస్తోంది.

విద్య ద్వారా సాధికారత అనే స్ఫూర్తితో యువత వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజం, దేశానికి సానుకూల మార్పు తీసుకురాగలిగేలా తీర్చిదిద్దడం వారధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్ తరాల మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని గుర్తించిన ఫౌండేషన్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం కాకుండా, అదే వ్యవస్థతో కలిసి పనిచేసి మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది.
ప్రభుత్వ విద్యా వ్యవస్థలు, సంస్థలు, ఉపాధ్యాయులకు అవసరమైన మద్దతు అందించడం ద్వారా వారు మరింత సమర్థవంతంగా పనిచేసి, ఎక్కువ మంది విద్యార్థుల జీవితాల్లో సుస్థిరమైన మార్పు తీసుకురావడానికి వారధి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఆనందకరమైన అభ్యాస పద్ధతుల్లో స్పోకెన్ ఇంగ్లీష్, కోడింగ్ తరగతులను నిర్వహిస్తోంది.

‘లెట్స్ టీచ్ ఇన్ ఇంగ్లీష్’ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదిలో మరింత ఆత్మవిశ్వాసంతో బోధించేందుకు, సమర్థవంతమైన బోధనా పద్ధతులను అభివృద్ధి చేసుకునేందుకు ఫౌండేషన్ సహకరిస్తోంది. ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT, తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్ష భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి.

52 జిల్లాల నుంచి 305 మంది విద్యార్థులు
విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, విశ్లేషణాత్మక ఆలోచన, తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచే సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు, విభిన్న అభిప్రాయాలను అర్థం చేసుకుని నిర్మాణాత్మకంగా చర్చించేలా ప్రోత్సహించేందుకు వారధి 2013 నుంచి ప్రతి ఏడాది వ్యాసరచన, చర్చా పోటీలను నిర్వహిస్తోంది.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 52 జిల్లాల నుంచి 305 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి వ్యాసరచన, చర్చా పోటీల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 25 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో 27 జిల్లాల నుంచి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించారు.

వార్షిక ఉపన్యాసంలో ప్రముఖుల సందేశాలు
2026 వార్షిక ఉపన్యాసంలో పర్యావరణవేత్త, వాటా ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ శ్రీ ఉదయ కృష్ణ పెద్దిరెడ్డి “మీరు చూడాలనుకుంటున్న మార్పు మీరే అవ్వండి” అనే అంశంపై ప్రసంగించారు.
అలాగే ‘అనగనగా’ చిత్ర కథానాయకుడు, నటుడు శ్రీ సుమంత్ “నేర్చుకోవడంలోని ఆనందం” అనే అంశంపై విద్యార్థులతో తన ఆలోచనలను పంచుకున్నారు.

విభిన్న రంగాల్లో తమ ప్రయాణాలను వివరించిన వారు.. నేర్చుకోవడం ద్వారా కలిగే శక్తిని, ప్రతి వ్యక్తి సానుకూల మార్పుకు నాంది పలకగల సామర్థ్యాన్ని విద్యార్థులకు వివరించారు. వారి ప్రసంగాలు వారధి లక్ష్యాలైన విద్య ద్వారా సాధికారత, ఆనందకరమైన అభ్యాసం, సానుకూల మార్పు అనే అంశాలను ప్రతిబింబించాయి.

విజేతలకు బహుమతులు
రాష్ట్రస్థాయి పోటీల్లో విజేత జట్లకు మొదటి బహుమతిగా రూ.33,000 లేదా సమాన విలువైన వస్తువులు, రెండో బహుమతిగా రూ.30,000, మూడో బహుమతిగా రూ.27,000 అందజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, న్యాయనిర్ణేతలు, స్వచ్ఛంద కార్యకర్తలు, వారధి మద్దతుదారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బహుమతులు వారధి వార్షిక వేడుకలో ముఖ్యమైన భాగమే అయినప్పటికీ.. విద్యార్థుల పట్టుదల, జిజ్ఞాస, నేర్చుకోవాలనే తపనే ఈ ప్రయాణానికి అసలైన బలమని ఫౌండేషన్ పేర్కొంది. తాము రాణించగలమనే నమ్మకాన్ని, తమకంటూ ఒక అర్థవంతమైన భవిష్యత్తును నిర్మించుకోగలమనే విశ్వాసాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమే తమ దృష్టిలో నిజమైన విజయమని వారధి ఇండియా ఫౌండేషన్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com