జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- October 05, 2026
బర్కా: ఒమన్‌లోని దక్షిణ అల్ బాతినా గవర్నరేట్‌లో సముద్ర జీవుల రక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. బర్కా విలాయత్ పరిధిలోని జబల్ అల్ సవాది చుట్టుపక్కల సముద్ర ప్రాంతంలో చిక్కుకుపోయిన చేపల వలలు, తాళ్లను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక పౌరుడు సముద్ర తాబేళ్లు చేపల వలల్లో చిక్కుకుని మృతి చెందినట్లు సమాచారం అందించడంతో.. పర్యావరణ అథారిటీ అధికారులు వెంటనే స్పందించారు.
ఒమన్ సీ డైవింగ్ టీమ్, బర్కా మున్సిపాలిటీ విభాగం సహకారంతో అత్యవసరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుమారు 26 మంది పాల్గొనగా.. వారిలో 13 మంది డైవర్లు ఉన్నారు. సముద్రంలో చిక్కుకున్న వలలు, తాళ్లను పూర్తిగా తొలగించారు. వీటి మొత్తం బరువు సుమారు 400 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దిమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్ సెంటర్ అధిపతి హమూద్ ఖమీస్ అల్ నైరీ మాట్లాడుతూ.. సముద్ర ప్రాంతంలో చిక్కుకున్న వలలు, మృతి చెందిన తాబేళ్లపై పౌరుడి నుంచి సమాచారం అందిందని తెలిపారు. దీంతో సంబంధిత విభాగాలతో అత్యవసర సమన్వయం చేసి వలలను తొలగించినట్లు వివరించారు. డైవింగ్, తనిఖీల సందర్భంగా వలల్లో చిక్కుకుని పలు సముద్ర తాబేళ్లు మృతి చెందినట్లు గుర్తించారు. అలాగే అనేక చేపలు, ఇతర సముద్ర జీవులు కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వదిలివేసిన లేదా పోగొట్టుకున్న చేపల వలలు సముద్ర పర్యావరణానికి, జీవులకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు.
మత్స్యకారులు, సముద్ర వినియోగదారులు వలలు, ఇతర చేపల వేట పరికరాలను సముద్రంలో వదిలిపెట్టకుండా జాగ్రత్త వహించాలని పర్యావరణ అథారిటీ సూచించింది. పోగొట్టుకున్న లేదా సముద్రంలో చిక్కుకున్న వలలను గుర్తించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. సముద్ర తాబేళ్లు, చేపలు, ఇతర సముద్ర జీవులను రక్షించడంతో పాటు.. సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







