ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!

- October 05, 2026 , by Maagulf
ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!

రియాద్: సౌదీ అరేబియాలో గుర్తుతెలియని, నిష్క్రియంగా ఉన్న ఎండోమెంట్ల (వక్ఫ్ ఆస్తుల) వివరాలను అధికారులకు తెలియజేసే వారికి భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. జనరల్ అథారిటీ ఫర్ ఎండోమెంట్స్ నిబంధనల ప్రకారం.. సమాచారం అందించిన వారికి ఎండోమెంట్ ఆస్తి విలువలో గరిష్ఠంగా 5 శాతం, అయితే 10 మిలియన్ సౌదీ రియాళ్లకు మించకుండా బహుమతి ఇవ్వనున్నారు.

గుర్తు తెలియని ఎండోమెంట్ అంటే..
లబ్ధిదారునికి ప్రయోజనం అందడం నిలిచిపోయిన ఎండోమెంట్ లేదా వక్ఫ్ ఆస్తిని గుర్తుతెలియని ఎండోమెంట్‌గా పరిగణిస్తారు. ట్రస్టీ లేకపోవడం, ట్రస్టీ లేదా ఆస్తిని నిర్వహిస్తున్న వ్యక్తి ఎండోమెంట్ వివరాలను దాచడం, ఆస్తి ఉన్న ప్రదేశం లేదా దానికి సంబంధించిన పత్రాలు తెలియకపోవడం వంటి పరిస్థితులు ఇందులోకి వస్తాయి.   గుర్తుతెలియని ఎండోమెంట్‌పై దర్యాప్తు చేపట్టాలని లేదా దాని వక్ఫ్ పత్రాన్ని అమలు చేయాలని సంబంధిత వ్యక్తులు అథారిటీని కోరవచ్చు. సదరు ఎండోమెంట్‌ను తిరిగి పునరుద్ధరించి అభివృద్ధి చేయడంలోనూ అథారిటీ సహాయం కోరే అవకాశం ఉంది.

రివార్డు ఎలా నిర్ణయిస్తారు?

ఎండోమెంట్ వివరాలను తొలిసారిగా వెల్లడించే వ్యక్తికి రివార్డు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలన్నది కమిటీ ఫర్ అన్‌నోన్ ఎండోమెంట్స్ నిర్ణయిస్తుంది. సమర్పించిన పత్రాల చెల్లుబాటు, సమస్య పరిష్కారానికి చేసిన కృషి, ఎండోమెంట్‌కు కలిగే ప్రయోజనం వంటి అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే సమాచారం ఇచ్చే వ్యక్తి ఆ ఎండోమెంట్ నిర్వాహకుడు లేదా దానిపై అక్రమంగా హక్కు కలిగి ఉన్న వ్యక్తి అయి ఉండకూడదు. ఒకే ఎండోమెంట్‌పై పలువురు సమాచారం ఇస్తే.. సాధారణంగా మొదట సమాచారం అందించిన వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది. అయితే తరువాత అందించిన సమాచారం సమస్య పరిష్కారంలో కీలకంగా ఉపయోగపడితే, ఆ వ్యక్తికి కూడా రివార్డు ఇచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com