ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- October 06, 2026
కువైట్ : డెలివరీ సంస్థలు తమ డ్రైవర్లు, మోటార్‌సైకిల్ రైడర్లు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కువైట్ ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ సెక్టార్ హెచ్చరించింది. ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ సెక్టార్ అధిపతి బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ ఫహద్ అల్-అజ్మీ డెలివరీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ రషీద్ హమూద్ అల్-హజ్రీతో పాటు పలువురు ట్రాఫిక్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. డెలివరీ వాహనాలు, మోటార్‌సైకిళ్లను నడిపే సిబ్బందిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం, నిబంధనల అమలును మెరుగుపరచడంపై చర్చించారు.
తమ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు వారి పనితీరును పర్యవేక్షించే బాధ్యత డెలివరీ సంస్థలదేనని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రైవర్లు ట్రాఫిక్ చట్టాలను పాటించేలా చూడటం ద్వారా వారి ప్రాణాలతో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల భద్రతను కాపాడాలని సూచించింది. కొంతమంది డెలివరీ డ్రైవర్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి మోటార్‌సైకిల్ లేదా వాహనాన్ని రెండు నెలల పాటు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోడ్డు భద్రతను పెంచేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని డెలివరీ సంస్థలు నిరంతరం పర్యవేక్షించాలని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!
- జ్ఞానేశ్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఢిల్లీలో అక్టోబర్ 17న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజ







