ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- October 06, 2026
దుబాయ్: ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల ఉద్యోగులుగా నకిలీ గుర్తింపులతో ప్రజలను మోసం చేస్తూ భారీ మొత్తంలో డబ్బు కొల్లగొట్టిన ఇద్దరు వ్యక్తులను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నిర్వహించిన ఫోన్ స్కామ్‌ల కారణంగా బాధితులు మొత్తం 11,877,532 దిర్హామ్‌లు (సుమారు రూ.27 కోట్లకు పైగా) నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు.
దుబాయ్ పోలీసుల యాంటీ-ఫ్రాడ్ సెంటర్ చేపట్టిన దర్యాప్తులో నిందితులు బాధితులకు ఫోన్ చేసి, వారి పేర్లు యూఏఈ వెలుపల నమోదైన కేసులు, ఫైళ్లలో ఉన్నాయని చెప్పినట్లు వెల్లడైంది. అనంతరం చట్టపరమైన చర్యలు తప్పవంటూ బెదిరించి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును విదేశీ ఖాతాలకు బదిలీ చేయాలని సూచించేవారు.
బదిలీ చేసిన మొత్తాన్ని పరిశీలించి, డబ్బు చట్టబద్ధమైనదని నిర్ధారణ అయిన తర్వాత తిరిగి ఇస్తామని నిందితులు బాధితులను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.
బంగారం విక్రయించేలా ఒత్తిడి
బాధితులు కోరినంత డబ్బు బదిలీ చేయకపోతే నిందితులు మరింత ఒత్తిడి చేసేవారని దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాల్లో బాధితులు తమ బంగారు ఆభరణాలను విక్రయించి, వచ్చిన డబ్బును కూడా బదిలీ చేయాలని నిందితులు ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇప్పటికే పంపిన మొత్తం సరిపోలేదని, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి మరింత డబ్బు అవసరమని వారు చెప్పేవారు. మరికొందరు బాధితులను హోటల్ గదులు బుక్ చేసుకోవాలని కూడా సూచించినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరితో సంబంధాలు తెంచుకుని, వారు చెప్పిన సూచనల మేరకు వ్యవహరించేలా ఒత్తిడి చేసేవారని పేర్కొన్నారు.
డబ్బు బదిలీలను ట్రేస్ చేసిన పోలీసులు
బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన అనంతరం దుబాయ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, సంబంధిత సమాచారాన్ని విశ్లేషించారు. డబ్బు బదిలీలను ట్రాక్ చేస్తూ బాధితులను సంప్రదించి మోసానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు.
అనంతరం వారిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. విచారణలో నిందితులు ఫోన్ మోసాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
యూఏఈ వెలుపల సోషల్ మీడియా ద్వారా ఒక సంస్థను సంప్రదించామని, ప్రతి విజయవంతమైన మోసానికి ప్రతిఫలంగా డబ్బు చెల్లించేలా ఆ సంస్థ తమను నియమించిందని నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వ్యక్తిగత వివరాలు, వారితో ఎలా మాట్లాడాలనే సూచనలను ప్రత్యేక అప్లికేషన్ ద్వారా పొందినట్లు పేర్కొన్నారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను పరిశీలించగా బాధితుల వ్యక్తిగత సమాచారం, మోసాలకు సంబంధించిన సంభాషణలు కూడా లభించాయని పోలీసులు తెలిపారు. ఇవి నిందితులకు వ్యతిరేకంగా కీలక ఆధారాలుగా మారాయి.
అనుమానాస్పద కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ప్రభుత్వ లేదా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులమంటూ ఫోన్, మెసేజ్‌లు చేసే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు. ముఖ్యంగా డబ్బు, బ్యాంకింగ్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని కోరినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
బెదిరింపులు, మానసిక ఒత్తిడికి లోనుకాకుండా, ఫోన్ చేసిన వ్యక్తుల గుర్తింపును సంబంధిత సంస్థల అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించారు.
ఫోన్ మోసాల కొత్త పద్ధతులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని దుబాయ్ పోలీసులు తెలిపారు. మోసపూరిత కాల్స్ లేదా ప్రయత్నాలను eCrime ప్లాట్‌ఫామ్ లేదా 901 కాల్ సెంటర్ ద్వారా నివేదించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!







