ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా

- October 08, 2026 , by Maagulf
ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్‌: ఆటిజం పై సమాజంలో ఉన్న అపోహలు, తప్పుడు అభిప్రాయాలను తొలగించి.. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు దయ కంటే గౌరవం, అవకాశాలు కల్పించాలని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. ఆటిజం వ్యాధి కాదని, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి అని పేర్కొన్నారు.

రెడ్‌హిల్స్‌లో మాధవ్‌ ఆటిజం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటిజం అవగాహన కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫౌండేషన్‌ పదేళ్ల సేవలను అభినందించారు. ఈ పదేళ్ల ప్రయాణం సేవ, అంకితభావం, నిరంతర కృషికి ప్రతీకగా నిలిచిందన్నారు.

ప్రతి చిన్నారి ప్రపంచాన్ని తనదైన రీతిలో అర్థం చేసుకుంటారని, వారి సామర్థ్యాలను గుర్తించి ముందుకు సాగేందుకు తగిన అవకాశాలు కల్పించడం సమాజ బాధ్యత అని గవర్నర్‌ అన్నారు. ఆటిజాన్ని సకాలంలో గుర్తించడం, సరైన జోక్యం, శిక్షణ, అవగాహన ఎంతో కీలకమన్నారు.

మాధవ్‌ ఆటిజం ఫౌండేషన్‌ ఆధునిక డే కేర్‌, డే బోర్డింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగడం అభినందనీయమని గవర్నర్‌ అన్నారు. ఈ కేంద్రం ప్రత్యేక పిల్లలకు సురక్షితమైన, ఆప్యాయతతో కూడిన వాతావరణాన్ని అందించే మరో ఇల్లుగా నిలవాలని ఆకాంక్షించారు. థెరపీ, విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సంగీతం, పౌష్టికాహారం వంటి సేవలను ఒకే చోట అందించడం మంచి ప్రయత్నమన్నారు.

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులను వేధించే ప్రధాన ప్రశ్న “మా తర్వాత మా పిల్లల పరిస్థితి ఏమిటి?” అనేదేనని గవర్నర్‌ అన్నారు. దీనికి కేవలం మౌలిక సదుపాయాలతో సమాధానం లభించదని, సున్నితమైన వ్యవస్థ, నిరంతర సహకారం, సమాజ సమష్టి బాధ్యత అవసరమని తెలిపారు.

మాధవ్‌ ఆటిజం ఫౌండేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ సుమన్‌ సరాఫ్‌ తన కుమారుడు మాధవ్‌ ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ.. వాటినే స్ఫూర్తిగా మార్చుకుని అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచారని గవర్నర్‌ ప్రశంసించారు.

ప్రత్యేక పిల్లల కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో పరిపాలన, వైద్య, పారిశ్రామిక, సామాజిక రంగాలకు చెందిన వారు చురుగ్గా భాగస్వాములు కావాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. సహకారం కేవలం ఆర్థికంగానే ఉండాల్సిన అవసరం లేదని, సమయం, నైపుణ్యం, వనరులు, మార్గదర్శకత్వం అందించడం ద్వారా కూడా ఈ కార్యక్రమాలను బలోపేతం చేయవచ్చన్నారు.

తెలంగాణలో సమ్మిళిత సమాజ నిర్మాణానికి మాధవ్‌ ఆటిజం ఫౌండేషన్‌ చేపడుతున్న కార్యక్రమం మంచి ఉదాహరణగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి ప్రత్యేక చిన్నారికి గౌరవం, అవకాశం, ఆత్మనిర్భరత కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఫౌండేషన్‌ పదేళ్లుగా అందిస్తున్న సేవలను అభినందిస్తూ.. భవిష్యత్‌ కార్యక్రమాలు విజయవంతం కావాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

కార్యక్రమంలో: తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, తెలంగాణ అగ్రవాల్‌ సమాజ్‌ అధ్యక్షుడు అనిరుద్ధ్‌ గుప్తా,మాధవ్‌ ఆటిజం ఫౌండేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ సుమన్‌ సరాఫ్‌, మాధవ్‌ ఆటిజం ఫౌండేషన్‌ కార్యదర్శి శ్రీ దిలీప్‌ పంసారీ, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ శశికుమార్‌ జైస్వాల్‌,ఏఐజీ హాస్పిటల్స్‌ వైద్యులు డాక్టర్‌ సందీప్‌ లఖ్‌టాకియా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com