ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- October 09, 2026
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఉక్రెయిన్‌లో ప్రధాన నగరమైన క్రామాటోర్స్‌పై రష్యా దళాలు భయానక దాడికి ఒడిగట్టాయి. సాధారణ ప్రయాణికులతో వెళ్తున్న రెండు ప్యాసింజర్ బస్సులపై రష్యా సైన్యం గ్లైడ్ బాంబులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
అంతేకాకుండా క్రామాటోర్స్క్ కమ్యూనిటీ పరిధిలోని బిలెన్కే గ్రామంలో జరిగిన మరో దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మొత్తం 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎక్కువ మంది పౌరులను బలితీసుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతోనే రష్యా ఈ బస్సులను లక్ష్యంగా చేసుకుందని డొనెట్స్క్ ప్రాంతీయ హెడ్ వదిమ్ ఫిలాష్కిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
డొనెట్స్క్ పరిధిలోని కీలకమైన ‘ఫోర్ట్రెస్ బెల్ట్’లో భాగమైన క్రామాటోర్స్క్, స్లోవియాన్స్క్ నగరాలను స్వాధీనం చేసుకోవడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే పౌరులు ప్రయాణించే రవాణా వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని అధికారులు ఆరోపించారు.
జెలెన్స్కీ తీవ్ర హెచ్చరిక
ఈ దారుణ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. “ఈ దాడిని మేము ఊరకనే వదిలిపెట్టం, తగిన రీతిలో ప్రతికారం తీర్చుకుంటాం” అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు.
డాన్‌బాస్ ప్రాంతంలో సర్వస్వం నాశనం చేసేందుకు రష్యా యత్నిస్తోందని, ప్రపంచ దేశాలు రష్యా దౌర్జన్యాలపై కఠినంగా స్పందించాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు.
ఐరాస, బ్రిటన్ ఆందోళన
ఈ ఏడాది ఆగస్టు నాటికి ఉక్రెయిన్‌లో మరణించిన పౌరుల సంఖ్య 2025 సంవత్సరం మొత్తంతో పోలిస్తే విపరీతంగా పెరిగిపోయిందని ఐక్యరాజ్యసమితి (UN) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున కీవ్ తూర్పు భాగంలోని ప్రిలుకీలో 5 అంతస్తుల నివాస భవనంపై రష్యా జరిపిన దాడిలో ఐదుగురు చిన్నారులతో సహా 22 మంది మరణించిన సంగతి తెలిసిందే.
కీవ్‌లో అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఎడ్ మిలిబాండ్ ఈ దాడులను తీవ్రంగా నిరసించారు. పుతిన్ సైనిక వ్యవస్థ, వ్యూహాత్మక చమురు సంస్థలు, క్రిప్టో రవాణా మరియు యుద్ధ నిధులపై మరింత కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తామని ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్ విజయం సాధించే వరకు బ్రిటన్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







