దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!

- October 09, 2026 , by Maagulf
దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!

దుబాయ్: యూఏఈలోని దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రకటించడంతో ప్రవాస కుటుంబాలు, ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అద్దె భారాన్ని తగ్గించుకోవడంతో పాటు చట్టబద్ధమైన నివాస సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పలువురు భావిస్తున్నారు. కొత్త నిబంధనలతో అద్దెదారులు, ఇంటి యజమానుల హక్కులు, బాధ్యతలపై స్పష్టత ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.

దుబాయ్ మున్సిపాలిటీ బుధవారం షేర్డ్ అకామడేషన్‌కు సంబంధించిన నిబంధనలు, ప్రమాణాలను వెల్లడించింది. గురువారం ఈ సదుపాయానికి అనుమతించే ప్రాంతాల జాబితాను కూడా ప్రచురించింది. కరామా, బర్షా-1, అల్ రిఖా వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 40కి పైగా ప్రాంతాల్లో ఈ విధమైన నివాసాలకు అనుమతి కల్పించనున్నారు.

 కుటుంబాలకు ఊరట

ఫిట్‌నెస్ ట్రైనర్ మహమ్మద్ అష్రఫ్ గత ఏడాది షేర్డ్ అకామడేషన్‌పై తనిఖీలు కఠినతరం కావడంతో భార్య, మూడేళ్ల కుమారుడిని భారత్‌కు పంపించారు. అంతకుముందు ఆయన కుటుంబం దుబాయ్‌లోని ఖుసైస్ ప్రాంతంలో షేరింగ్ విల్లాలో నివసించేది. తనిఖీలు పెరగడంతో ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారని, తక్కువ సమయంలో తక్కువ అద్దె ఇల్లు దొరకకపోవడంతో కుటుంబాన్ని భారత్‌కు పంపాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది రమదాన్ తర్వాత కుటుంబాన్ని తిరిగి తీసుకురావాలని భావించినప్పటికీ, ప్రాంతీయ ఘర్షణల కారణంగా ప్రణాళిక ఆలస్యమైందని చెప్పారు. తాజాగా షేర్డ్ హౌసింగ్ నిబంధనలు ప్రకటించడంతో సరసమైన అద్దె ఇళ్లు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అద్దె పేరుతో మోసాలకు అడ్డుకట్ట పడేనా?

ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రవాసి మరియా ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లోని దేరా ప్రాంతంలో షేరింగ్ వసతి కల్పిస్తానని చెప్పిన ఓ ఏజెంట్‌కు దాదాపు Dh 4,000 చెల్లించారు. ఇతర మహిళలతో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించేందుకు నెల అద్దెను ముందుగానే చెల్లించినట్లు ఆమె తెలిపారు. అయితే, అక్కడ చేరిన మూడు రోజులకే షేర్డ్ అకామడేషన్‌కు అనుమతి లేదని, ఇబ్బందులు ఎదురవుతాయని ఇంటి యజమాని చెప్పడంతో ఆమెను ఖాళీ చేయమన్నారు. డబ్బు తిరిగి పొందేందుకు ఏజెంట్‌ను సంప్రదించగా, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని మరియా వెల్లడించారు. కొత్త నిబంధనలతో వసతి ఒప్పందాలపై స్పష్టత ఏర్పడి, అద్దెదారులు చట్టపరమైన రక్షణ పొందగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐదు రోజుల్లోనే ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి

భారతీయ ప్రవాసి షెహనాజ్ హుస్సేన్ కూడా షేర్డ్ అకామడేషన్ విషయంలో ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. ఈ ఏడాది ఒక సందర్భంలో ఇంటి యజమాని అక్కడ కుటుంబాలు మాత్రమే నివసించవచ్చని చెప్పడంతో, ఆమె తన స్నేహితురాలితో కలిసి కేవలం ఐదు రోజుల్లోనే ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఉద్యోగులకు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం స్పష్టమైన ఒప్పందాలు, నివాసానికి సంబంధించిన నియమాలు ఉంటే ఆకస్మికంగా ఇళ్లు ఖాళీ చేయించడాన్ని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

2027 సెప్టెంబర్ 8 వరకు గడువు

కొత్త చట్టం ప్రకారం ఆస్తుల యజమానులు, షేర్డ్ అకామడేషన్ నిర్వహకులు తమ కార్యకలాపాలను నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఏడాది గడువు ఇచ్చారు. ఈ ప్రక్రియను 2027 సెప్టెంబర్ 8లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ భవనాల్లో వ్యక్తులు, ఏ భవనాల్లో కుటుంబాలు నివసించవచ్చనే అంశంపై స్పష్టత రావడం వల్ల అద్దెదారులు ఇల్లు ఎంపిక చేసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

మొత్తంగా, దుబాయ్‌లో కొత్త షేర్డ్ హౌసింగ్ నిబంధనలు అమలులోకి రావడంతో తక్కువ అద్దె వసతి కోసం ఎదురుచూస్తున్న ప్రవాస కుటుంబాలు, ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి. అయితే, అద్దె ధరలు ఎంతవరకు తగ్గుతాయనేది వసతి లభ్యత, నిబంధనల అమలు, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని రియల్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com