కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!

- October 09, 2026 , by Maagulf
కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!

 కువైట్: కువైట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు భారీగా నమోదయ్యాయి. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి వరకు 153 రోజుల వ్యవధిలో మొత్తం 1,118,668 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి. వీటిలో అతివేగంతో వాహనాలు నడపడం, అక్రమ పార్కింగ్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వంటి ఉల్లంఘనలు అధికంగా ఉన్నాయి.

గణాంకాల ప్రకారం.. అత్యధికంగా అతివేగంతో వాహనాలు నడిపినందుకు 415,806 ఉల్లంఘనలు నమోదయ్యాయి. అక్రమ పార్కింగ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 267,584 ఉల్లంఘనలు నమోదయ్యాయి. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు ఉపయోగించినందుకు 94,945 కేసులు నమోదయ్యాయి.  

అదే విధంగా సీట్‌బెల్ట్ ధరించకపోవడం 82,607 కేసులు, రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం 33,052 కేసులు, రహదారిపై సూచించిన లేన్ మార్కింగ్‌లను పాటించకపోవడం, రోడ్డు పక్క మార్గాల్లో వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం, ఈ ఉల్లంఘనలు కూడా ట్రాఫిక్ గణాంకాల్లో నమోదయ్యాయి.

రోడ్డు భద్రతపై అధికారుల దృష్టి

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ప్రమాదకర డ్రైవింగ్‌ను అరికట్టేందుకు కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ చర్యలు కొనసాగిస్తోంది. ట్రాఫిక్ పర్యవేక్షణ, తనిఖీలు, అమలు కార్యక్రమాల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారుల్లో నిబంధనలపై అవగాహన పెంచడం లక్ష్యంగా  పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

వాహనదారులు వేగ పరిమితులను పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం, సీట్‌బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించడం ద్వారా ప్రమాదాల ముప్పును తగ్గించుకోవచ్చని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com