అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- October 10, 2026
మస్కట్: అరేబియా సముద్రంలో నివసించే హంప్‌బ్యాక్ వేల్స్ ఇతర ప్రాంతాల్లోని తిమింగలాల కంటే జన్యుపరంగా ప్రత్యేకమైనవని తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. ఈ తిమింగలాలను హంప్‌బ్యాక్ జాతిలో నాలుగో ఉపజాతిగా గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS), ఎన్విరాన్మెంట్ సొసైటీ ఆఫ్ ఒమన్ (ESO), ఒమన్ పర్యావరణ ప్రాధికార సంస్థతో పాటు ఇతర స్థానిక, అంతర్జాతీయ సంస్థలు కలిసి ఈ పరిశోధన చేపట్టాయి. అరేబియా సముద్ర హంప్‌బ్యాక్ తిమింగలాలపై 25 ఏళ్లకు పైగా కొనసాగుతున్న పరిశోధనల్లో ఇది కీలక ముందడుగుగా నిలిచింది.
2,285 వేల్స్ జన్యు విశ్లేషణ
మెరైన్ ఫ్రంటియర్స్ సైన్స్ (Frontiers in Marine Science) జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన 2,285 హంప్‌బ్యాక్ వేల్స్ మైటోకాండ్రియల్ DNA నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో అరేబియా సముద్ర తిమింగలాలు ఉత్తర అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్, దక్షిణ అర్ధగోళ ప్రాంతాల్లో నివసించే వేల్స్ నుంచి జన్యుపరంగా గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీటి మధ్య జన్యు మార్పిడి చాలా పరిమితంగా ఉన్నట్లు అధ్యయనం సూచించింది. వీటి పరిణామ క్రమం ఇతర సమూహాల నుంచి వేల సంవత్సరాల క్రితమే వేరుపడినట్లు పరిశోధకులు అంచనా వేశారు. వివిధ జన్యు సమూహాల మధ్య విభజన సుమారు 43,000 నుంచి 113,000 సంవత్సరాల క్రితం జరిగినట్లు విశ్లేషణలో వెల్లడైంది.
25 ఏళ్ల పరిశోధనతో కీలక ఆధారాలు
ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ రీటా అమరల్ మాట్లాడుతూ.. అరేబియా సముద్ర హంప్‌బ్యాక్ వేల్స్ జీవన విధానం ఇతర వాటి కంటే భిన్నంగా ఉందని తెలిపారు. తాజా జన్యు పరిశోధన వాటి ప్రత్యేకత ఎలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఎన్విరాన్మెంట్ సొసైటీ ఆఫ్ ఒమన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పరిశోధన సహ రచయిత సుఆద్ అల్ హార్తీ మాట్లాడుతూ.. తొలినాళ్లలో చిన్న పడవల ద్వారా వేల్స్ ఫొటోలు తీయడం, వాటి నుంచి స్వల్ప కణజాల నమూనాలు సేకరించడంతో ప్రారంభమైన పరిశోధన, ప్రస్తుతం ఉపగ్రహ ట్రాకింగ్, శబ్ద పర్యవేక్షణ, ఆరోగ్య పరీక్షలు వంటి ఆధునిక పద్ధతులకు విస్తరించిందని వివరించారు.
పొంచి ఉన్న ముప్పు
అరేబియా సముద్ర హంప్‌బ్యాక్ తిమింగలాల జనాభా తక్కువగా ఉండటం, ఇతర సమూహాలతో వాటి సంబంధాలు పరిమితంగా ఉండటంతో వాటి మనుగడపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వాటికి ఎదురవుతున్న ప్రధాన ముప్పులు:
- చేపల వలల్లో చిక్కుకోవడం.
- నౌకలు ఢీకొనడం.
- సముద్రంలో నీటి అడుగున శబ్ద కాలుష్యం.
- సముద్ర కాలుష్యం, వ్యాధులు.
- వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాలు, సముద్రంలో పోషక పదార్థాల పైకి వచ్చే ప్రక్రియలో మార్పులు.
ఈ పరిణామాలు సార్డిన్ చేపలు సహా వాటి ఆహార లభ్యతను ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత రెండు దశాబ్దాల్లో ఈ వేల్స్ జనాభా పెరిగినట్లు ఆధారాలు లేవని అధ్యయనం పేర్కొంది. ముప్పులను తగ్గించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోకపోతే కొన్ని ప్రాంతాల్లో ఈ జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
సముద్ర జీవుల సంరక్షణకు ఒమన్ చర్యలు
ఒమన్ పర్యావరణ ప్రాధికార సంస్థకు చెందిన ఐదా అల్ జబ్రీ మాట్లాడుతూ.. పరిశోధన ద్వారా ఈ తిమింగలాల ప్రాధాన్యం, అవి ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టత పెరిగిందని తెలిపారు. శాస్త్రీయ ఆధారాలను ఆచరణాత్మక సంరక్షణ చర్యలుగా మార్చడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేల్స్ కమిషన్ ద్వారా ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, ముఖ్యమైన సముద్ర ఆవాసాలకు అంతర్జాతీయ స్థాయిలో రక్షణ కల్పించే అవకాశాలను పరిశీలించడం ఇందులో భాగమని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







