సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- October 11, 2026
టాంజానియా: సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్యానికి రక్షణ కల్పించడంతో పాటు, ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా బహ్రెయిన్ కీలక ముందడుగు వేసింది. టాంజానియాలోని అరుషాలో జరిగిన 153వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) అసెంబ్లీలో ఐదు రోజుల పాటు చురుకుగా పాల్గొన్న బహ్రెయిన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం పలు కీలక చర్చలు, ఒప్పందాలతో తన పర్యటనను ముగించింది.
బహ్రెయిన్ షూరా కౌన్సిల్ తొలి ఉపాధ్యక్షుడు జమాల్ మొహమ్మద్ ఫఖ్రో నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ అసెంబ్లీలో పాల్గొంది. బృందంలో డిప్యూటీ హెడ్ హలా రమ్జీ ఫయేజ్‌తో పాటు ఎంపీలు హసన్ ఇబ్రహీం హసన్, జైనబ్ అబ్దులమీర్ ఖలీల్, అలీ సఖర్ అల్ దోసెరి ఉన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా 40 సమావేశాలు, చర్చలు, వర్క్‌షాప్‌లలో పాల్గొన్న ఈ బృందం.. తొమ్మిది ద్వైపాక్షిక, సమన్వయ చర్చలు నిర్వహించింది. ఈ అసెంబ్లీకి 130కి పైగా దేశాల నుంచి సుమారు 700 మంది పార్లమెంటేరియన్లు హాజరయ్యారు. వీరిలో 50 మంది పార్లమెంట్ స్పీకర్లు, 45 మంది డిప్యూటీ స్పీకర్లు ఉన్నారు.
సముద్ర వాణిజ్య మార్గాల రక్షణకు ప్రతిపాదన
స్వేచ్ఛాయుత నౌకాయానం, సముద్ర వాణిజ్య మార్గాల పరిరక్షణ కోసం పార్లమెంట్లు అత్యవసర చర్యలు చేపట్టాలని కోరుతూ బహ్రెయిన్ ప్రవేశపెట్టిన అత్యవసర ప్రతిపాదనకు 877 ఓట్లు లభించాయి. అయితే నేపాల్ ప్రవేశపెట్టిన ప్రతిపాదన కంటే కేవలం 24 ఓట్లు వెనుకబడటంతో బహ్రెయిన్ ప్రతిపాదన ఆమోదం పొందలేకపోయింది. సముద్ర రవాణా, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశాన్ని బహ్రెయిన్ ఈ అసెంబ్లీలో బలంగా ప్రస్తావించింది.
బ్రిటన్, చైనా సహా పలు దేశాలతో చర్చలు
అసెంబ్లీ సందర్భంగా బహ్రెయిన్ ప్రతినిధులు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, అజర్‌బైజాన్, సెర్బియా, జింబాబ్వే, ఉక్రెయిన్‌తో పాటు ట్వెల్వ్ ప్లస్ గ్రూప్, పార్లమెంటరీ అసెంబ్లీ ఆఫ్ లా ఫ్రాంకోఫోనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ చర్చలు అంతర్జాతీయ పార్లమెంటరీ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు దోహదపడ్డాయి.
గల్ఫ్–లాటిన్ అమెరికా మధ్య చారిత్రాత్మక ఒప్పందం
ఈ పర్యటనలో మరో కీలక పరిణామంగా గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) శాసన మండళ్లకు, లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాల పార్లమెంటరీ గ్రూప్ (గ్రులాక్)కు మధ్య సహకార ఒప్పందం కుదిరింది. గ్రులాక్ అధ్యక్షుడు రోజో ఎడ్వర్డ్స్ సిల్వాతో కలిసి జమాల్ మొహమ్మద్ ఫఖ్రో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో జీసీసీ శాసన మండళ్లు, లాటిన్ అమెరికా–కరేబియన్ పార్లమెంటరీ గ్రూప్ మధ్య అధికారిక సహకారానికి కొత్త మార్గం ఏర్పడింది. ఇదిలా ఉండగా, ఐపీయూ 32వ అధ్యక్షుడిగా ఆస్ట్రేలియా హౌస్ స్పీకర్ మిల్టన్ డిక్ ఎన్నికయ్యారు. ఒకే విడతలో జరిగిన ఓటింగ్‌లో ఆయన 56 శాతం ఓట్లు సాధించారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







