సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!

- October 11, 2026 , by Maagulf
సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!

రియాద్‌: సౌదీ అరేబియాలో అక్రమ వలసదారులపై భద్రతా బలగాలు కఠిన చర్యలు చేపట్టాయి. అక్టోబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 13,889 మంది అక్రమ నివాసితులను అరెస్ట్‌ చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపింది.

అరెస్టయిన వారిలో వివిధ చట్టాలను ఉల్లంఘించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
- 6,785 మంది — రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనదారులు
- 3,710 మంది — సరిహద్దు భద్రతా చట్ట ఉల్లంఘనదారులు
- 3,394 మంది — కార్మిక చట్ట ఉల్లంఘనదారులు
అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,382 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 66 శాతం మంది ఇథియోపియా జాతీయులు, 33 శాతం మంది యెమెన్‌ జాతీయులు కాగా, మిగిలిన ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారు. అలాగే, అక్రమంగా సౌదీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 34 మందిని కూడా అధికారులు అరెస్ట్‌ చేశారు.

10 వేల మందికి పైగా దేశం నుంచి బహిష్కరణ

అక్రమ నివాసితులపై చర్యల్లో భాగంగా 10,431 మందిని దేశం నుంచి బహిష్కరించారు. మరో 18,947 మందిని ప్రయాణ పత్రాలు పొందేందుకు వారి దేశాల దౌత్య కార్యాలయాలకు పంపించారు. అదేవిధంగా 4,596 మందిని ప్రయాణ ఏర్పాట్లను పూర్తి చేసుకునేందుకు సంబంధిత అధికారుల వద్దకు పంపించారు. ఇదిలా ఉండగా, అక్రమ వలసదారులకు రవాణా, ఆశ్రయం, ఉపాధి కల్పించిన ఆరోపణలపై 21 మందిని కూడా అరెస్ట్‌ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 30,438 మంది పురుషులు, 2,675 మంది మహిళలు సహా మొత్తం 33,113 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యల ప్రక్రియ కొనసాగుతోంది.

అక్రమ వలసదారులకు సహకరిస్తే కఠిన శిక్షలు

అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు సహకరించడం, ప్రయాణానికి రవాణా సదుపాయాలు కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం లేదా ఇతరత్రా సహాయం చేయడం చట్టరీత్యా నేరమని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ హెచ్చరించింది.ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల సౌదీ రియాల్స్‌ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. అక్రమ వలసదారుల రవాణాకు ఉపయోగించిన వాహనాలు, ఆశ్రయం కల్పించిన ఇళ్లను కూడా స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

అక్రమ వలసలకు సంబంధించిన ఘటనలు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. మక్కా, రియాద్‌, తూర్పు ప్రావిన్స్‌ ప్రాంతాల్లో 911 నంబర్‌కు, సౌదీలోని ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com