సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- October 12, 2026
మనామాః ప్రార్థన కోసం వెలిగించిన కొవ్వొత్తి నిర్లక్ష్యంగా వదిలేయడంతో జరిగిన అగ్నిప్రమాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనలో సహోద్యోగి మృతికి కారణమైన 21 ఏళ్ల ఆసియా మహిళకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం ఆమెను శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
అసలేం జరిగింది?
ఒకే అపార్ట్‌మెంట్‌లో మరో ముగ్గురు మహిళా సహోద్యోగులతో కలిసి నిందితురాలు నివసిస్తోంది. ఘటన జరిగిన రోజు ఉదయం సుమారు 11 నుంచి 11.30 గంటల మధ్య ఆమె తన గదిలో ప్రార్థనలు చేసుకునేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా బార్లీ, బియ్యం పిండితో తయారు చేసిన కొవ్వొత్తిని చిన్న చెక్క బల్లపై వెలిగించింది. సాధారణంగా తాను ఆ కొవ్వొత్తిని రోజంతా వెలిగించే ఉంచుతానని ఆమె విచారణలో తెలిపింది. అయితే, గది నుంచి బయటకు వెళ్లే సమయంలో కొవ్వొత్తిని ఆర్పకుండా అలాగే వదిలేసింది. అనంతరం మరో సహోద్యోగితో కలిసి హాల్‌లో కూర్చుంది. ఆ సమయంలో బాధితురాలు అపార్ట్‌మెంట్‌లోనే ఉంది.
మధ్యాహ్నం సుమారు 2.15 నుంచి 2.19 గంటల మధ్య బాధితురాలు మరో సహోద్యోగికి ఫోన్ చేసి సహాయం కోరింది. తాను బాత్‌రూమ్‌లో ఉండగా గదిలో మంటలు చెలరేగాయని తెలిపింది. వెంటనే అక్కడికి వెళ్లిన సహోద్యోగికి గదిలో మంటలు కనిపించాయి. బాధితురాలు ‘మంటలు.. మంటలు’ అంటూ కేకలు వేయడం కూడా వినిపించింది. ఆమెను రక్షించేందుకు ఇతర మహిళలు ప్రయత్నించినప్పటికీ, మంటలు, దట్టమైన పొగ కారణంగా గదిలోకి వెళ్లలేకపోయారు.
రంగంలోకి ఫైర్ సిబ్బంది
అపార్ట్‌మెంట్‌లోని ఫైర్ అలారం శబ్దం విన్న భవనం సెక్యూరిటీ గార్డు ఐదో అంతస్తుకు చేరుకున్నాడు. మంటలు వ్యాపిస్తున్న అపార్ట్‌మెంట్ బయట ముగ్గురు మహిళలు కనిపించగా, తమ సహోద్యోగి ఇంకా లోపలే ఉందని వారు తెలిపారు. దీంతో అతను వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించాడు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె ప్రాణాలు కోల్పోయింది. అగ్నిప్రమాదంలో బెడ్‌రూమ్‌తో పాటు అందులోని వస్తువులు దెబ్బతిన్నాయి. వేడి, పొగ కారణంగా అపార్ట్‌మెంట్‌లోని ఇతర ప్రాంతాలు కూడా దెబ్బతిన్నట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు.
తన నిర్లక్ష్యమే కారణమని అంగీకారం
విచారణ సమయంలో, కోర్టు ఎదుట కూడా నిందితురాలు తానే ప్రార్థన కోసం కొవ్వొత్తిని వెలిగించినట్లు అంగీకరించింది. చెక్క బల్లపై కొవ్వొత్తి పెట్టేటప్పుడు కింద ప్లేట్ పెట్టలేదని, గది నుంచి బయటకు వెళ్లే ముందు దాన్ని ఆర్పలేదని తెలిపింది.కొవ్వొత్తి వల్ల అగ్నిప్రమాదం జరుగుతుందని తాను ఊహించలేదని, తన సహోద్యోగి మరణానికి తానే బాధ్యత వహిస్తున్నానని అంగీకరించింది. మంటలను ఎలా అదుపు చేయాలో, బాధితురాలిని ఎలా రక్షించాలో తనకు తెలియదని పేర్కొంది. చెక్క బల్లపై మండుతున్న కొవ్వొత్తి వదిలేయడమే అగ్నిప్రమాదానికి కారణమై ఉండవచ్చని ఘటనా స్థల పరిశీలన నివేదికలో పేర్కొన్నారు.
కోర్టు కీలక తీర్పు
ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. సహోద్యోగి మరణానికి కారణమైన నిర్లక్ష్యానికి, అలాగే కంపెనీకి చెందిన అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడానికి నిందితురాలిని బాధ్యురాలిగా కోర్టు నిర్ధారించింది.నిందితురాలి వాంగ్మూలం, సాక్షుల స్టేట్‌మెంట్లు, మృతురాలి ఫోరెన్సిక్ వైద్య నివేదిక, సివిల్ డిఫెన్స్ నివేదికలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ, శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







