ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- October 12, 2026
ఢిల్లీ: దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటం మరో స్వాతంత్య్ర ఉద్యమమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛ, స్వపరిపాలన కల్పించేందుకు ఆనాడు కాంగ్రెస్ నాయకులు పోరాడారని, ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం తెలిపారు. ఓటు బచావో.. దేశ్ బచావో ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం సాగిందని, ఇప్పుడు ఓటు హక్కును కాపాడుకునేందుకు ‘జ్ఞానేశ్ గో బ్యాక్’, ‘ఎస్ఐఆర్ గో బ్యాక్’ నినాదాలతో ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని సీఎం అన్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ముందుపెట్టి, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం ఆరోపించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల త్యాగాలు చిరస్మరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమ సమయంలో లాలా లజపతిరాయ్ లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఎందరో నాయకుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. అయితే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశ ప్రజలకు ఓటు అనే శక్తిమంతమైన ఆయుధాన్ని అందించిందన్నారు. రాజరిక, కుటుంబ పాలనలకు ముగింపు పలికి ప్రజల చేతిలో అధికారం పెట్టడంలో ఓటు హక్కు కీలక పాత్ర పోషించిందని సీఎం తెలిపారు. పేదలు, దళితులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించడం ద్వారా అంబేడ్కర్ సమానత్వానికి బాటలు వేశారని సీఎం కొనియాడారు.
గతంలో ఓటు హక్కు కల్పించేందుకు ఎస్ఐఆర్
గతంలోనూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. 1950లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ప్రక్రియ ద్వారా ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు కల్పించారని సీఎం గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో ప్రజలు ఎక్కడ స్థిరపడ్డారు? ఎవరు ఏ ప్రాంతానికి వెళ్లారు? అనే వివరాలను గుర్తించాల్సిన అవసరం కూడా అప్పట్లో ఏర్పడిందని పేర్కొన్నారు. తర్వాత ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాల కాలంలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందని గుర్తు చేశారు. అయితే, గతంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని చేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టేవారని అన్నారు. ఇప్పుడు మోదీ, అమిత్ షాల పాలనలో మాత్రం ఇప్పటికే ఓటు హక్కు ఉన్నవారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీఎం మండిపడ్డారు. గతంలో ఈ ప్రక్రియను ప్రజలకు మేలు చేసే చర్యగా చూశారని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ అధికారానికి అడ్డుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, నార్కోటిక్స్ విభాగం వంటి సంస్థలను ఉపయోగించుకుందని, ఇప్పుడు వాటితో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కష్టమవుతోందనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ను తెరపైకి తెచ్చారని సీఎం విమర్శించారు. ఈసీఐ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ముందుపెట్టి మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అని అన్నారు. అలాంటి సంస్థను రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సీఎం హితవు పలికారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత దెబ్బతింటే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
పారదర్శకత కోసమే నాడు ఎన్నికల సంఘంలో మార్పులు
గతంలో ఎన్నికల సంఘం ఒక్క కమిషనర్ నేతృత్వంలో పనిచేసేదని, అయితే, ఈ సంస్థలో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్న సమయంలో ముగ్గురు కమిషనర్ల విధానాన్ని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష నేత భాగస్వామ్యంతో నియామక ప్రక్రియ సాగేదన్నారు. మోదీ ప్రభుత్వం 2023లో ఈ విధానాన్ని మార్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషనర్ల నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేర్చారని ఆరోపించారు. నిర్ణయాలను తమకు అనుకూలంగా తీసుకునేందుకే ఈ మార్పులు చేశారని సీఎం మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో నిష్పక్షపాతానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించే సమయంలోనే రాహుల్‌గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జ్ఞానేశ్తో ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల తొలగింపునకు అవకాశం కల్పిస్తున్నారని సీఎం ఆరోపించారు.
దళితులు, గిరిజనులు, పేదల ఓట్లే లక్ష్యమా?
దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజల ఓటు హక్కులను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశ యువత ఓట్లను తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సీఎం మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిని లక్ష్యంగా చేసుకుని వారి ఓటు హక్కులను తొలగించే యోచనలో ఉందని సీఎం విమర్శించారు. ఈ ప్రమాదాన్ని తొలుత గుర్తించి దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చింది రాహుల్ గాంధీయేనని సీఎం వెల్లడించారు. మొదట్లో ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై తగినంతగా దృష్టి పెట్టలేదని, తాజా పరిణామాలతో పరిస్థితి తీవ్రత అందరికీ అర్థమవుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలే కాకుండా అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి వంటి వారు ఈ అంశంపై గొంతెత్తడమే ఇందుకు సంకేతమని సీఎం వ్యాఖ్యానించారు.
మోదీ, అమిత్ షాల మౌనం ఎందుకు?
జ్ఞానేశ్ కుమార్ నియామకంలో ఎలాంటి కుట్ర లేదని మోదీ, అమిత్ షాలు భావిస్తే, ఆయనను తొలగించాలనే డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వారు ఎందుకు అండగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారని, నిరసనలను ఎందుకు అణచివేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఢిల్లీలో భారీగా పోలీసులను ఎందుకు మోహరిస్తున్నారో వివరించాలన్నారు. జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న చర్యల వల్ల రాజకీయంగా లబ్ధి పొందుతున్నది బీజేపీ మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి కొంతమేర బలం ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ విజయాలకు ఓటర్ల జాబితాలో జరుగుతున్న మార్పులు కూడా కారణమనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో పూర్తి పారదర్శకత ఉండాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు.
జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?
2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి పదవికి పోటీ చేసిన సమయంలో దేశంలో సుమారు 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2019లో ఈ సంఖ్య సుమారు 91 కోట్లకు, 2024 ఎన్నికల నాటికి సుమారు 97 కోట్లకు చేరిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 2026లో ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ తొలగించే ఓట్ల సంఖ్యను 20 కోట్లకు పెంచే కుట్ర ప్రయత్నం జరుగుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో దేశ జనాభా ఎంత? ప్రస్తుతం ఎంత? అనే వివరాలను పరిశీలించాలన్నారు. జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణమేంటని సీఎం ప్రశ్నించారు. జనాభా పెరిగితే ఓటర్ల సంఖ్య పెరగాలా? తగ్గాలా? అన్నది సాధారణ ప్రశ్నేనని, దీనికి ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
ఓటు ఉన్నవారు..లేనివారంటూ రెండు వర్గాలా?
దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేనివారనే రెండు వర్గాలను సృష్టించే పరిస్థితి ఏర్పడుతోందని
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను శ్రీమంతులు, పేదలు అనే వర్గాలుగా విడదీసి, పేదల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం ఆరోపించారు. సంపన్నులు బీజేపీకి మద్దతుగా ఉంటారని, పేదలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారనే రాజకీయ లెక్కలతో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఓటు హక్కును తొలగించడం ద్వారా కొన్ని వర్గాల ప్రజలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు ప్రతి పౌరుడికీ అందాలని, పేదలు, దళితులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేశారు.
రాహుల్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం
ఆనాడు ‘సైమన్ గో బ్యాక్’ నినాదం స్వాతంత్య్ర పోరాటానికి కొత్త ఊపునిచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో సాగుతున్న ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ ఉద్యమం దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, ఓటు హక్కును కాపాడేందుకు దోహదపడుతుందన్నారు. గాంధీ కుటుంబం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిందని, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీ ‘ఓట్ చోరీ’ ప్రచారం ద్వారా ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు పోరాటం చేస్తున్నారని సీఎం తెలిపారు. అందులో భాగంగానే తాము ఢిల్లీకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ఈ పోరాటాన్ని మరో స్వాతంత్య్ర ఉద్యమం మాదిరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, దళితులు, గిరిజనులకు ఓటు హక్కు ఉండకూడదనే అభిప్రాయాలను బీజేపీ, దాని సైద్ధాంతిక గురువైన ఆర్ఎస్ఎస్ నాయకులు గతంలో వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అయితే, బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం అన్నారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్, ఇండియా కూటమి తమ పోరాటాన్ని కొనసాగిస్తాయని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు సచిన్ సావంత్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







