బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!

- October 13, 2026 , by Maagulf
బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!

మనామా: విద్యుత్, నీటి బిల్లుల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌరులకు ఉపశమనం కల్పించేలా బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) స్థిర బిల్లింగ్ విధానంలో నమోదు చేసుకునేందుకు ప్రత్యేక గడువును ప్రకటించారు. ఈ నిర్ణయం మే 2026 నుంచి వర్తించేలా వెనుక తేదీతో అమలు చేయనున్నారు. ఈ విధానం ప్రకారం, పౌరుల మొదటి నివాసానికి సంబంధించి మే నెల నుంచి జారీ చేసిన బిల్లులకు, వారి సగటు నెలవారీ బిల్లుకు మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసాన్ని EWA ఖాతాల్లో క్రెడిట్ చేయనున్నారు. విద్యుత్, నీటి ఖర్చులను ముందుగానే అంచనా వేసుకునేందుకు, ఏడాది పొడవునా బిల్లుల్లో ఆకస్మిక మార్పుల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదేశాలను ఆలస్యం లేకుండా అమలు చేయాలని విద్యుత్, నీటి వ్యవహారాల మంత్రిని క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారు.

అక్టోబర్ 31 వరకు నమోదు
విద్యుత్, నీటి వ్యవహారాల మంత్రి యాసర్ బిన్ ఇబ్రహీం హుమైదాన్ తెలిపిన వివరాల ప్రకారం.. EWA ఇప్పటికే ఈ ఆదేశాల అమలును ప్రారంభించింది. స్థిర బిల్లింగ్ విధానంలో చేరేందుకు అక్టోబర్ 31 వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ పథకం కింద మే నుంచి సెప్టెంబర్ 2026 వరకు జారీ చేసిన బిల్లులు, సగటు నెలవారీ బిల్లు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే..
ఈ విధానం ద్వారా అర్హులైన పౌరులు తమ మొదటి నివాసానికి సంబంధించిన గత సగటు బిల్లుల ఆధారంగా నిర్ణయించిన స్థిరమైన నెలవారీ మొత్తాన్ని చెల్లించవచ్చు. దీంతో గృహ విద్యుత్, నీటి ఖర్చులను క్రమబద్ధంగా నిర్వహించుకోవడానికి వీలవుతుంది. అలాగే, ఈ విధానంలో ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ కావు. వినియోగదారులు ఆమోదించిన చెల్లింపు మార్గాల్లో తమకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవచ్చు. ఈ నిర్ణయంతో అర్హులైన బహ్రెయిన్ పౌరులకు గత నెలల బిల్లుల వ్యత్యాసంపై ఉపశమనం లభించడంతో పాటు, భవిష్యత్తులో నెలవారీ ఖర్చులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకునే అవకాశం కలగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com