దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- October 13, 2026
స్పార్క్ మీడియా అరుణ్ కుమార్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న పాటకు విశేష స్పందన.. బాలు ఖ్యాతి, మాట్ల తిరుపతి, మధుప్రియ ప్రశంసలు
దుబాయ్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళల వైభవాన్ని ప్రతిబింబించే ‘ఇసుక తిన్నెలపై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం దుబాయ్‌లోని బుర్ దుబాయ్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖులు, కళాకారులు, మీడియా ప్రతినిధులు, తెలంగాణ ఆడపడుచుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
స్పార్క్ మీడియా అధినేత అరుణ్ కుమార్ నిర్మాణంలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. గేయ రచయిత, గాయకుడు నరేష్ సాహిత్యం అందించడంతో పాటు తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ప్రముఖ జానపద గాయని శ్రీనిధి ఆలాపన పాటకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రముఖ జర్నలిస్ట్ బాలు ఖ్యాతి, ప్రముఖ సంగీత దర్శకుడు మాట్ల తిరుపతి, జానపద గాయని మధుప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ రియల్టర్ మనోజ్ చైతన్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన పాట
పాటను వీక్షించిన ప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ ప్రత్యేకతను అందంగా ఆవిష్కరించేలా పాటను రూపొందించారని ప్రశంసించారు.
ప్రముఖ జర్నలిస్ట్ బాలు ఖ్యాతి పాట రూపకల్పనను అభినందిస్తూ, తెలంగాణ సంస్కృతిని విదేశీ గడ్డపై సైతం చాటిచెప్పే ఇటువంటి ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మాట్ల తిరుపతి పాటలోని జానపద సౌందర్యాన్ని, కళాకారులు మరియు సాంకేతిక బృందం కృషిని ప్రశంసించారు. జానపద గాయని మధుప్రియ సైతం పాటను అభినందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఓపీ, డైరెక్టర్ కమిలి పటేల్, టెక్నికల్ అడ్వైజర్ జలంధర్, స్పార్క్ మీడియా అధినేత అరుణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధులు, పాట చిత్రీకరణలో భాగస్వాములైన కళాకారులు తొలిసారిగా పాటను వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. పాటలోని దృశ్యాలు, చిత్రీకరణ తీరు తెలంగాణ పల్లె సంస్కృతిని అందంగా ప్రతిబింబిస్తున్నాయని కొనియాడారు.
చిత్రీకరణకు పలువురి సహకారం
‘ఇసుక తిన్నెలపై బతుకమ్మ’ పాట రూపకల్పన, చిత్రీకరణలో పలువురు తమ వంతు సహకారం అందించారు. ముఖ్యంగా లెమన్ స్టూడియో అధినేత రమేష్ తుమ్మా కీలక సహకారం అందించారు. అలాగే లగ్జరీ హబ్‌కు చెందిన రాజేష్, శుభం డెకోర్స్‌కు చెందిన ప్రియ, మాగల్ఫ్ న్యూస్ తమ మద్దతును అందించారు.
దుబాయ్‌లో నివసిస్తున్న పలువురు తెలంగాణ యువకులు, ఆడపడుచులు కూడా పాట చిత్రీకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న అభిమానంతో అందరూ కలిసికట్టుగా సహకరించడం ఈ పాట రూపకల్పనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వైభవాన్ని చాటే ప్రయత్నం
తెలంగాణ మట్టివాసన, జానపద కళల గొప్పతనం, బతుకమ్మ పండుగ విశిష్టతను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పాలనే ఉద్దేశంతో ‘ఇసుక తిన్నెలపై బతుకమ్మ’ పాటను రూపొందించారు. విదేశీ గడ్డపై తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ పాట ప్రవాస తెలంగాణ ప్రజల్లో సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆటపాటలు, అభినందనలు, ఆనందోత్సాహాల మధ్య పాట ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా ముగిసింది.



తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







