షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- October 16, 2026
షార్జా: యూఏఈలో కాలేజీ అడ్మిషన్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి Dh1.515 మిలియన్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తికి షార్జా కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నకిలీ గుర్తింపును ఉపయోగించడంతో పాటు, తనకు పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి బాధితుడి నుంచి డబ్బులు తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసును సంబంధిత సివిల్ కోర్టుకు బదిలీ చేస్తూ, కోర్టు ఖర్చులు చెల్లించాలని కూడా నిందితుడిని ఆదేశించింది.
తన కుమారుడికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఓ తండ్రి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, అతని పరిచయస్తుడి ద్వారా నిందితుడి గురించి తెలిసింది. దీంతో బాధితుడు ఫోన్లో నిందితుడిని సంప్రదించాడు. తాను అడ్మిషన్ ఇప్పించగలనని నమ్మించిన నిందితుడు, తొలుత Dh70,000 నగదు ఇవ్వాలని కోరాడు. షార్జాలోని ఓ షాపింగ్ సెంటర్ వద్ద బాధితుడి కుమారుడి నుంచి ఆ మొత్తాన్ని తీసుకున్నాడు.
ట్యూషన్ ఫీజు, పెట్టుబడి పేరుతో భారీ వసూళ్లు
ఆ తర్వాత ఓ హోటల్లో బాధితుడిని కలిసిన నిందితుడు, కుమారుడికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తానని మరోసారి హామీ ఇచ్చాడు. మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు పేరుతో అదనంగా Dh445,000 చెల్లించాలని కోరాడు. అంతేకాకుండా పెట్టుబడి కోసం మరో Dh1 మిలియన్ కావాలని అడిగాడు. మరుసటి రోజు బాధితుడి కుమారుడు నిందితుడికి Dh1.445 మిలియన్లు అందజేశాడు. అంతకుముందు ఇచ్చిన Dh70,000 కలిపి మొత్తం Dh1.515 మిలియన్లు చెల్లించారు. అయితే, నిందితుడు ఇచ్చిన హామీ మేరకు కాలేజీ అడ్మిషన్ జరగలేదు. తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదు.
నగదు రూపంలోనే చెల్లించాలని ఒత్తిడి
ఈ వివాదం గురించి తెలిసిన ఓ మహిళ కోర్టులో సాక్ష్యం ఇచ్చింది. బాధితుడితో వృత్తిపరమైన సంబంధాలు, నిందితుడితో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పరిచయాలు ఉన్న ఆమె జోక్యం చేసుకున్నట్లు తెలిపింది. డబ్బులు తీసుకున్న విషయాన్ని నిందితుడు అంగీకరించినట్లు కోర్టుకు వివరించింది. బాధితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ.. మొదటి నుంచే ఆధారాలు మిగలకుండా నిందితుడు జాగ్రత్తపడ్డాడని తెలిపారు. బ్యాంకు ఖాతా ద్వారా డబ్బులు తీసుకోలేనని చెబుతూ నగదు రూపంలోనే చెల్లించాలని కోరాడని, తన వ్యక్తిగత కారులోనే డబ్బులు అందజేయాలని సూచించాడని వివరించారు.
ఈ కేసులో నిందితుడి గుర్తింపు, బాధితుడితో జరిగిన సమావేశాలు, ఫోన్ సంభాషణలు, చెల్లింపులకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు న్యాయవాది తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలు, ఫోన్ సందేశాలను కూడా ఆధారాలుగా కోర్టుకు సమర్పించారు.
నకిలీ గుర్తింపుతో మోసం చేసినట్లు నిర్ధారణ
కేసులోని ఆధారాలను పరిశీలించిన షార్జా కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్, నిందితుడు తప్పుడు గుర్తింపు, మోసపూరిత పద్ధతులను ఉపయోగించి బాధితుడి నుంచి డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారించింది. దీంతో అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించి, డబ్బుల వివాదానికి సంబంధించిన అంశాలను సివిల్ కోర్టుకు బదిలీ చేసింది.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







