తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

- October 17, 2026 , by Maagulf
తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. ప్రతిష్టాత్మక ‘పర్వతమాల’ స్కీమ్ కింద దాదాపు రూ.1,230 కోట్ల భారీ అంచనా వ్యయంతో రాష్ట్రంలోని ఐదు ప్రముఖ క్షేత్రాల్లో అత్యాధునిక రోప్‌వేల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

ఏయే ప్రాంతాల్లో కొత్త రోప్‌వేలు రానున్నాయి?
రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ క్రింది 5 ప్రాంతాల్లో కొత్తగా రోప్‌వేలను అందుబాటులోకి తీసుకురానున్నారు:

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపైకి.
నాగార్జునకొండ: నల్గొండ జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం.
రామగిరి కోట: పెద్దపల్లి జిల్లాలోని చారిత్రక శోభ కలిగిన పురాతన కోట.
హనుమాన్ హిల్: నల్గొండ పట్టణంలోని కొండప్రాంతం.
ఖిల్లా రామాలయం: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని అత్యంత ప్రాచీన ఆలయం.
ఇప్పటికే పురోగతిలో భువనగిరి, ఖమ్మం ఖిల్లా రోప్‌వేలు

రాష్ట్రంలో ఇప్పటికే రెండు చారిత్రక కోటలపై రోప్‌వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధ ఏకశిలా రాతి కోట భువనగిరి ఖిల్లా, చారిత్రక ఖమ్మం ఖిల్లా పైకి రోప్‌వే నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే పురోగతిలో ఉంది. ఇప్పుడు కొత్తగా మరో 5 ప్రాజెక్టులు తోడవుతుండటంతో తెలంగాణ పర్యాటక రంగ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి.

పర్యావరణహితం, సమయం ఆదా.. రెట్టింపు కానున్న ఆదాయం!
రోప్‌వేల రాకతో కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్ల ప్రయాణంతో పోలిస్తే సమయం, ఇంధనం భారీగా ఆదా అవుతాయి. అంతేకాకుండా రోప్‌వేల వల్ల ఎలాంటి శబ్ద, వాయు కాలుష్యం ఉండదు. ఈ రోప్‌వే ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే సాహస, ఆధ్యాత్మిక పర్యాటకం విశేషంగా ఊపందుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే టూరిస్టుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీని ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున కొత్త ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖకు ఆదాయం రెట్టింపవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com