బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?

- October 18, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?

మనామా: అద్దె ఒప్పందం ముగిసిన తర్వాత ఇంటిని లేదా ఆస్తిని యజమాని తిరిగి స్వీకరించేందుకు నిరాకరిస్తే.. అద్దెదారులు అద్దె చెల్లింపులను నిలిపివేసే అవకాశం కల్పించేలా బహ్రెయిన్‌లో చట్ట సవరణ ప్రతిపాదించారు. 2014 నాటి ఆస్తుల అద్దె చట్టానికి ఈ సవరణలు చేయాలని ప్రతిపాదించగా, దీనిపై పార్లమెంటులో మరోసారి చర్చ జరగనుంది. ఈ ప్రతిపాదనను షూరా కౌన్సిల్ తిరస్కరించడంతోపాటు ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రతినిధుల మండలి ఈ అంశాన్ని మరోసారి పరిశీలించనుంది. అయితే, గతంలో ఎంపీలు ఆమోదించిన ప్రతిపాదనకే మద్దతు ఇవ్వాలని పార్లమెంటరీ ప్రజా సేవలు, పర్యావరణ కమిటీ సిఫార్సు చేసింది.

కోర్టును ఆశ్రయించే అవకాశం

ప్రతిపాదిత సవరణల ప్రకారం.. అద్దె ఒప్పందం ముగిసిన తర్వాత ఆస్తిని తిరిగి అప్పగించాలనే విషయాన్ని అద్దెదారులు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా ఇరుపక్షాలు అంగీకరించిన ఎలక్ట్రానిక్ విధానంలో యజమానికి తెలియజేయాలి. ఆస్తి స్వాధీనాన్ని తిరస్కరించాలనుకుంటే యజమాని మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అలాగే, 10 రోజుల్లోగా స్పందించకపోయినా దానిని ఆస్తి అప్పగింతను తిరస్కరించినట్లుగా పరిగణిస్తారు.

యజమాని తిరస్కరణ తర్వాత కూడా నెల రోజుల పాటు వివాదం పరిష్కారం కాకపోతే.. అద్దెదారులు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చు. ఆస్తిని తిరిగి అప్పగించినట్లు ధ్రువీకరించాలని, ఇంటి తాళాలను కోర్టులో జమ చేసేందుకు అనుమతించాలని కోరవచ్చు.

తాళాలు కోర్టులో జమ చేస్తే అద్దె చెల్లింపులు నిలిపివేత

ఈ సవరణలకు ఆమోదం లభిస్తే.. ఇంటి తాళాలను కోర్టులో జమ చేసిన తేదీ నుంచి అద్దె చెల్లింపులు, వాటికి సంబంధించిన ఇతర బాధ్యతలు నిలిచిపోతాయి. అయితే, ఆస్తిని మొదట ఉన్న స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత అద్దెదారులపైనే ఉంటుంది. ఇంటికి లేదా ఆస్తికి ఏవైనా నష్టాలు కలిగితే, నిబంధనల ప్రకారం యజమానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

అద్దె ఒప్పందాల పునరుద్ధరణపై కూడా మార్పులు

ఈ ప్రతిపాదనలో అద్దె ఒప్పందాల పునరుద్ధరణకు సంబంధించిన నిబంధనలను కూడా మార్చాలని సూచించారు. మొదట చేసుకున్న ఒప్పందం ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఉంటే, ఆటోమేటిక్ రెన్యూవల్ వ్యవధిని గరిష్ఠంగా ఒక ఏడాదికి పరిమితం చేయాలని ప్రతిపాదించారు. ఏడాది కంటే తక్కువ కాలానికి చేసుకున్న ఒప్పందాలకు మాత్రం ప్రస్తుతం ఉన్న పునరుద్ధరణ వ్యవధులే కొనసాగుతాయి.

ప్రభుత్వం అభ్యంతరం ఉంటే..

ప్రస్తుత పౌర, వాణిజ్య చట్టపరమైన విధానాల్లోనే యజమానులు ఆస్తులను తిరిగి స్వీకరించడానికి నిరాకరించిన సందర్భాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. అందువల్ల కొత్త నిబంధనలు అవసరం లేదని అభిప్రాయపడింది. అలాగే, అద్దె ఒప్పందాల పునరుద్ధరణ వ్యవధిపై పరిమితులు విధించడం వల్ల ఒప్పంద స్వేచ్ఛకు భంగం కలగవచ్చని హెచ్చరించింది. ఈ ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది తదుపరి చర్చలు, ఓటింగ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదిత సవరణలు మాత్రమే అని అధికార యంత్రాంగం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com