ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- October 19, 2026
రియాద్: ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల భద్రత, విశ్వసనీయతను పెంపొందించే టెక్నాలజీ అమలులో సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రిసోర్స్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూట్ ఆరిజిన్ వాలిడేషన్ (RPKI RoV) టెక్నాలజీ అమలులో 99.8% సాధించినట్లు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ఇంటర్నెట్ రిజిస్ట్రీ APNIC తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇంటర్నెట్ ట్రాఫిక్, సరైన అధీకృత నెట్‌వర్క్‌ల ద్వారా ప్రయాణిస్తుందో లేదో ధ్రువీకరించడంలో RPKI RoV టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ విశ్వసనీయత లేని నెట్‌వర్క్‌లకు మళ్లించే ప్రమాదం తగ్గుతుంది.
అంతర్జాతీయ స్థాయిలో సౌదీకి గుర్తింపు
కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) ఈ విజయంపై స్పందిస్తూ.. అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలను అనుసరించడంలో దేశ టెలికమ్యూనికేషన్ల రంగం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ ఘనతతో ప్రపంచ స్థాయి సాంకేతిక సూచీల్లో సౌదీ అరేబియా పోటీతత్వ స్థానం మరింత బలపడిందని తెలిపింది. దేశ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల సామర్థ్యం, విశ్వసనీయత, భద్రత మరింత మెరుగుపడుతున్నాయని వివరించింది.
IPv6 అమలులోనూ టాప్-5లో సౌదీ
ఇంటర్నెట్ వ్యవస్థ అభివృద్ధిలో సౌదీ అరేబియా ఇప్పటికే పలు కీలక విజయాలను సాధించింది.
- RPKI RoV: ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం.. 99.8% అమలు.
- IPv6: ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 అమలులో ప్రపంచంలోని మొదటి ఐదు దేశాల్లో స్థానం.
- DNSSEC: డొమైన్ నేమ్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్టెన్షన్స్ ధ్రువీకరణలో G20 దేశాల్లో మొదటి స్థానం.
ఈ విజయాలు దేశ ఇంటర్నెట్ వ్యవస్థలో భద్రత, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచేందుకు చేపడుతున్న సమగ్ర చర్యలను ప్రతిబింబిస్తున్నాయని CST వెల్లడించింది.
ఇంటర్నెట్ భద్రకు RPKI RoV ముఖ్యం
ఇంటర్నెట్లో డేటా ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు ప్రయాణించే సమయంలో, దాని మార్గాన్ని తప్పుగా ప్రకటించడం వల్ల ట్రాఫిక్ అనధికార నెట్‌వర్క్‌లకు మళ్లే ప్రమాదం ఉంటుంది. RPKI RoV టెక్నాలజీ నెట్వర్క్ మార్గాల అధీకృతతను ధ్రువీకరించడంలో సహాయపడుతుంది. ఈ టెక్నాలజీని విస్తృతంగా అమలు చేయడం ద్వారా ఇంటర్నెట్ రూటింగ్ భద్రతను బలోపేతం చేయవచ్చు. డిజిటల్ సేవలపై ప్రజలు, సంస్థలకు విశ్వాసం పెరగడంతోపాటు, దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల సమర్థతకు కూడా ఇది దోహదపడుతుంది. సౌదీ అరేబియా సాధించిన తాజా విజయం.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థను మరింత సురక్షితంగా, సమర్థంగా తీర్చిదిద్దేందుకు కొనసాగుతున్న ప్రయత్నాల్లో మరో కీలక ముందడుగుగా నిలిచింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







