ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- October 20, 2026
దోహా: ప్రాంతీయ మిత్రదేశాలతో కలిసి కొత్త రక్షణ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఖతార్‌లో ప్రత్యేక రక్షణ కేంద్రాన్ని (డిఫెన్స్ హబ్) ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ ఉప ప్రధానమంత్రి, రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్ థానీ వెల్లడించారు. గ్లోబల్ సెక్యూరిటీ ఫోరంలో జరిగిన ప్రారంభ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రాంతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, దేశ రక్షణ ప్రాధాన్యతలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల అవసరంపై ఆయన మాట్లాడారు. దౌత్యపరమైన ప్రయత్నాలతో పాటు సైనిక సంసిద్ధత కూడా సమానంగా అవసరమని స్పష్టం చేశారు. వాయు రక్షణ వ్యవస్థలు, డ్రోన్ల ద్వారా జరిగే దాడులను ఎదుర్కొనే సామర్థ్యం, సైబర్ భద్రత, ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడం కొత్త రక్షణ వ్యూహంలో భాగమని తెలిపారు. దేశీయంగా తయారీ చేపట్టడంతో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి భాగస్వామ్య దేశాలతో కలిసి సంబంధిత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు ఉన్నాయని వివరించారు.
ఖతార్‌కు మూడు రకాల భద్రతా ముప్పులు
2025 జూన్ నుంచి ఖతార్ మూడు ప్రధాన ముప్పులను ఎదుర్కొంటోందని ఉప ప్రధాని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే బాహ్య దాడులు, ఖతార్‌తో పాటు విస్తృత గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలకు అంతరాయం, ప్రాంతీయ ఘర్షణల ప్రభావం ఇతర దేశాలకు విస్తరించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇంధన సరఫరాలకు ఆటంకం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులపై ఖర్చుల భారం పెరుగుతుందని హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత కొనసాగితే తూర్పు-పడమర దేశాల మధ్య సప్లై చైన్ లు దెబ్బతినడంతో పాటు, ఇతర దేశాలకు గల్ఫ్ దేశాలు అందించే సహాయం, యూరప్, అమెరికాల్లో గల్ఫ్ పెట్టుబడుల ద్వారా ఏర్పడే ఉద్యోగాలపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు.
జీసీసీ దేశాలతో సమన్వయం
ఖతార్ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకుంటూనే మిత్రదేశాలు, గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సభ్యదేశాలతో కలిసి పనిచేస్తుందని ఉప ప్రధాని తెలిపారు. ప్రాంతీయ భద్రతకు జీసీసీ దేశాల మధ్య సహకారం పునాది అని పేర్కొన్నారు. అమెరికాతో ఖతార్‌కు దశాబ్దాలుగా రక్షణ భాగస్వామ్యం కొనసాగుతోందని చెప్పారు.
అల్ ఉదైద్ ఎయిర్ బేస్ గురించి మాట్లాడుతూ, అది ఖతార్‌కు చెందిన వైమానిక స్థావరమని, అమెరికా సహా ఇతర అంతర్జాతీయ భాగస్వాములు దానిని ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో అక్కడ 20కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. ఖతార్ వైమానిక దళం, సైన్యం, మిత్రదేశాల అవసరాలకు అనుగుణంగా ఈ స్థావరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
దౌత్యం, రక్షణ సంసిద్ధత అవసరం
వివాదాలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఖతార్ వ్యూహంలో కీలక భాగమని ఉప ప్రధాని పేర్కొన్నారు. శాంతియుత చర్చలకు ప్రయత్నించడం అంటే దేశ రక్షణ విషయంలో సంసిద్ధతను విస్మరించడం కాదని స్పష్టం చేశారు. వివాదాల పరిష్కారానికి నిరంతర కృషి, సహనం అవసరమని చెప్పారు.
ఇరాన్‌తో శాశ్వత శాంతికి చర్చలు అవసరం
గత ఏడాది జూన్‌లో జరిగిన పరిణామాలకు ముందు ఇరాన్‌తో ఖతార్ సంబంధాలు విశ్వాసం ఆధారంగా కొనసాగాయని, అంతకుముందు ఎలాంటి ఘటన జరగలేదని ఉప ప్రధాని పేర్కొన్నారు. శాశ్వత శాంతి సాధించాలంటే అన్ని పక్షాల ఆందోళనలను పరిష్కరించేలా పరస్పర విశ్వాసం, దాడులు చేయబోమనే ఒప్పందం ఆధారంగా శాంతి ప్రక్రియ సాగాలని అన్నారు.
హార్ముజ్ రవాణా రుసుములపై అభ్యంతరం
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై రవాణా రుసుములు విధించడాన్ని ఖతార్, జీసీసీ దేశాలు వ్యతిరేకిస్తున్నాయని ఉప ప్రధాని తెలిపారు. వర్తించే వాణిజ్య చట్టాల ప్రకారం అనుమతించిన సందర్భాలు మినహా ఇటువంటి రుసుములకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి, ఇతర సముద్ర మార్గాలపై అనిశ్చితి కొనసాగితే ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ మార్కెట్లు, వినియోగదారులపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







