ఒమన్‌లో బయటపడ్డ ప్రాచీన సమాధులు..!!

- October 28, 2026 , by Maagulf
ఒమన్‌లో బయటపడ్డ ప్రాచీన సమాధులు..!!

మస్కట్‌: ఒమన్‌లోని అల్‌ ధహిరా గవర్నరేట్‌ పరిధిలో ఉన్న ఇబ్రీలో పురావస్తు తవ్వకాలు చేపట్టగా, క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్దానికి చెందిన ప్రాచీన సమాధులు వెలుగుచూశాయి. ఈ తవ్వకాల్లో మానవ అస్థిపంజర అవశేషాలు, పూర్తిస్థాయిలో ఉన్న మట్టి పాత్రలు, లోహపు వస్తువులు బయటపడ్డాయి. అల్‌ ఐనైన్‌ ప్రాంతంలోని పురావస్తు ప్రదేశంలో గత వారం ప్రారంభమైన తవ్వకాల్లో సమాధి గదులను గుర్తించారు. వీటిలో లభించిన అస్థిపంజర అవశేషాలు, మట్టి పాత్రల్లో ఎక్కువ భాగం మెసపొటేమియాకు చెందిన జెమ్డెట్‌ నస్ర్‌ నాగరికతకు సంబంధించినవిగా భావిస్తున్నారు.

నివాస ప్రాంతంలో రక్షణ తవ్వకాలు

అల్‌ ధహిరా గవర్నరేట్‌ వారసత్వ, పర్యాటక శాఖ డైరెక్టర్‌ వాలిద్‌ బిన్‌ హమద్‌ అల్‌ ఘఫ్రీ ఈ వివరాలను వెల్లడించారు. అల్‌ ఐనైన్‌లో నివాస సముదాయం అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న ప్రాచీన సమాధులను రక్షించేందుకు ఈ తవ్వకాలను చేపట్టినట్లు తెలిపారు. ట్టణ విస్తరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో చారిత్రక ఆధారాలు ధ్వంసం కాకుండా కాపాడటం, పురావస్తు వస్తువులను వెలికితీసి భద్రపరచడం ఈ తవ్వకాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.

రాగి, కంచు వస్తువులు.. పెద్ద సంఖ్యలో పూసలు

తవ్వకాల్లో రాగి, కంచుతో తయారు చేసిన వస్తువులు కూడా బయటపడ్డాయి. వీటిలో బాణాల మొనలు, గొడ్డళ్లు, బాకులు ఉన్నాయి. అదే కాలానికి చెందిన పెద్ద సంఖ్యలో పూసలు సైతం లభించాయి. త్యేక నిపుణుల బృందం ఈ నెలాఖరు వరకు తవ్వకాలను కొనసాగించనుంది. ప్రాథమిక పరిశీలనల ప్రకారం ఈ పురావస్తు ప్రదేశానికి గణనీయమైన చారిత్రక ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒమన్‌ ప్రాచీన చరిత్రపై కొత్త వెలుగులు

క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్దంలో ఒమన్‌కు, పొరుగు నాగరికతలకు మధ్య ఉన్న సంబంధాలు, సాంస్కృతిక మార్పిడి గురించి ఈ ఆవిష్కరణలు కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉంది. ఒమన్‌ ప్రాచీన చరిత్రను, విస్తృత ప్రాంతంతో ఆ దేశానికి ఉన్న సాంస్కృతిక సంబంధాల పరిణామాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ ఆధారాలు దోహదపడతాయని పురావస్తు నిపుణులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com