యూఏఈలో వేతన చెల్లింపుల వ్యవస్థ అప్‌గ్రేడ్..!!
- October 29, 2026
దుబాయ్: యూఏఈలో ఉద్యోగులకు జీతాల చెల్లింపులను మరింత వేగవంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు వేతన రక్షణ వ్యవస్థ (WPS)ను అప్‌గ్రేడ్ చేసినట్లు మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. యజమానుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, సమాచార భద్రతను బలోపేతం చేయడం, జీతాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడం ఈ కొత్త డిజిటల్ విధానం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. 2025 డిసెంబర్లో అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వేతన రక్షణ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేపట్టారు. కేవలం వేతన చెల్లింపుల నిబంధనల అమలుకే పరిమితం కాకుండా, యజమానులు, ఉద్యోగులకు మెరుగైన డిజిటల్ సేవలను అందించే సమగ్ర వ్యవస్థగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు
కొత్త విధానం ప్రకారం యజమానులు వేతన రక్షణ వ్యవస్థలో నమోదు చేసుకునేందుకు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్థిక సంస్థల కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సిన పనిలేదు. మంత్రిత్వ శాఖ వ్యవస్థలతో అనుసంధానమైన ఆర్థిక సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు. దీంతో ఈ సేవలను తక్షణమే అందించే అవకాశం ఏర్పడింది. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE), అల్ ఎతిహాద్ పేమెంట్స్ సహకారంతో MoHRE ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన జాతీయ చెల్లింపుల సంస్థ అల్ ఎతిహాద్ పేమెంట్స్.. వేతన రక్షణ వ్యవస్థకు సంబంధించిన కేంద్ర డిజిటల్ వేదికను నిర్వహిస్తోంది. సురక్షితమైన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ల (APIs) ద్వారా వివిధ సంస్థల మధ్య సమాచార మార్పిడి తక్షణమే జరిగేలా ఈ వేదికను రూపొందించారు. దీనివల్ల సమాచార ఖచ్చితత్వం, విశ్వసనీయత పెరగడంతో పాటు వేతనాల బదిలీ ప్రక్రియ వేగవంతం కానుంది.
మరో 7 సంస్థలతో భాగస్వామ్యం
వేతన రక్షణ వ్యవస్థ పరిధిలో సేవలను క్రమంగా విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా మరో 7 సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకున్నారు.
- ఫస్ట్ అబుదాబి బ్యాంక్ (FAB)
- ఎమిరేట్స్ ఎన్బీడీ (Emirates NBD)
- దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ (DIB)
- మష్రెక్ బ్యాంక్
- అజ్మాన్ బ్యాంక్
- లారీ ఎక్స్ఛేంజ్
- ఫస్ట్ గల్ఫ్ ఎక్స్ఛేంజ్ సెంటర్
ఈ 7 సంస్థల చేరికతో వేతన రక్షణ వ్యవస్థలో భాగస్వాముల సంఖ్య 17కు చేరింది.
ప్రైవేట్ రంగంలోని 99 శాతానికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
యూఏఈ వేతన రక్షణ వ్యవస్థ ప్రైవేట్ రంగంలోని 99 శాతానికి పైగా ఉద్యోగులకు సేవలందిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి నెల సగటున Dh37 బిలియన్ విలువైన వేతన చెల్లింపులు జరుగుతున్నాయి. కార్మిక మార్కెట్లో పారదర్శకత, స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు తెలిపారు. MoHRE కార్మిక రక్షణ విభాగం అసిస్టెంట్ అండర్‌సెక్రటరీ దలాల్ అల్షెహ్హీ మాట్లాడుతూ..అప్‌గ్రేడ్ చేసిన వేతన రక్షణ వ్యవస్థ కేవలం వేతన చెల్లింపుల నిబంధనల అమలుకు సంబంధించిన విధానం మాత్రమే కాదని, యూఏఈ కార్మిక మార్కెట్‌కు మద్దతునిచ్చే సమగ్ర డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యకలాపాల్లో బ్యూరోక్రసీ తగ్గింపునకు తోడ్పాటు
ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ సేవల్లో అనవసరమైన అధికారిక ప్రక్రియలను తగ్గించే ‘జీరో గవర్నమెంట్ బ్యూరోక్రసీ’ లక్ష్యానికి మద్దతు లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ‘వుయ్ ద యూఏఈ 2031’ జాతీయ విజన్‌లో భాగంగా ఆర్థిక సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడం, డిజిటల్ ఆర్థిక నిర్వహణలో పారదర్శకత, పటిష్టతను పెంపొందించడం వంటి లక్ష్యాలకు ఈ అప్‌గ్రేడ్ దోహదపడుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆన్లైన్లో పిల్లల రక్షణ అందరి బాధ్యత..!!
- బహ్రెయిన్‌లోని ఎంబసీని సందర్శించిన ఎంపీ రాజతి సల్మా..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపుపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- యూఏఈలో వేతన చెల్లింపుల వ్యవస్థ అప్‌గ్రేడ్..!!
- కువైట్‌లో స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 6.0..!!
- ఖతార్‌లో ఆర్లా ప్రోటీన్ పుడ్డింగ్ బ్యాచ్‌ల రీకాల్..!!
- స్పెయిన్‌లో ఘోర రైళ్లు ప్రమాదం..68 మంది దుర్మరణం
- వరద సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
- చమురు లీకేజీ ప్రభావం..షార్జాలో అన్ని బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత
- జయేశ్ రంజన్ బదిలీ







