దుబాయ్‌లో నవంబర్ 16 నుంచి వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2026.. 90కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు

- November 06, 2026 , by Maagulf
దుబాయ్‌లో నవంబర్ 16 నుంచి వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2026.. 90కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు

220 మందికి పైగా అంతర్జాతీయ పోలీసు, భద్రతా రంగ ప్రముఖుల భాగస్వామ్యం.. 150కి పైగా సంస్థల ప్రదర్శనలు

దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థలు, భద్రతా రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఐదవ ఎడిషన్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2026 నవంబర్ 16 నుంచి 18 వరకు దుబాయ్‌లో జరగనుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు.

యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సును దుబాయ్ పోలీస్ నిర్వహిస్తుండగా, DXB LIVE సమన్వయం చేస్తోంది. “Connected for Impact: Uniting Global Policing to Safeguard Future Generations” అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సదస్సు కొనసాగనుంది.

ఈ సదస్సులో 90కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. పోలీసు విభాగాలు, ప్రైవేట్ రంగ సంస్థలు, విద్యా రంగానికి చెందిన 220 మందికి పైగా ప్రముఖులు తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకోనున్నారు. మొత్తం 15 విభిన్న అంశాలపై చర్చలు, ప్యానెల్ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే 150కి పైగా ఎగ్జిబిటర్లు తమ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.

ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ఎగ్జిబిషన్ ప్రాంగణంలో అంతర్జాతీయ సంస్థల కోసం ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పోలీస్ (GCCPOL)తో పాటు ASEANAPOL, CARICOM, ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ కార్యాలయం (UNODC), షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO), కౌన్సిల్ ఆఫ్ అరబ్ మినిస్టర్స్ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ సెక్రటేరియట్ సహా ఆరు అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయి.

సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు ముందుగానే సమావేశాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వరల్డ్ పోలీస్ సమ్మిట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సందర్శకులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ సమావేశాలను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చని నిర్వాహకులు సూచించారు.

పోలీస్ రంగంలో ప్రతిభకు అవార్డులు

పోలీసింగ్, భద్రతా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించేందుకు 13 విభాగాల్లో వరల్డ్ పోలీస్ సమ్మిట్ అవార్డులను అందజేయనున్నారు. నవంబర్ 2న షార్ట్‌లిస్ట్ ప్రకటించగా, నవంబర్ 9న విజేతల పేర్లను వెల్లడించనున్నారు. నవంబర్ 18న సదస్సు చివరి రోజున అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు.

ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ స్టీఫెన్ నట్, ఇంటర్‌పోల్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీఫెన్ ఫ్రై, AIRPOL పోలీస్ కమిషనర్ పీటర్ నిల్సన్‌తో పాటు వివిధ దేశాల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు, పరిశ్రమల ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా వరల్డ్ పోలీస్ సమ్మిట్ సెక్రటరీ జనరల్, దుబాయ్ పోలీస్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్స్ అండ్ క్రిమినాలజీ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ రషీద్ హమ్దాన్ అల్ ఘఫ్రీ మాట్లాడుతూ.. నేటి ప్రపంచంలో నేరాలు, భద్రతా సవాళ్లు దేశాల సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ఏ ఒక్క పోలీసు వ్యవస్థ కూడా ఒంటరిగా ఈ సవాళ్లను ఎదుర్కోలేదని, అంతర్జాతీయ భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరస్పర సహకారం ద్వారా సమాజాలకు మరింత భద్రత కల్పించవచ్చని తెలిపారు.

ఆక్సాన్ ఎంటర్‌ప్రైజ్ వ్యవస్థాపకుడు, సీఈఓ రిక్ స్మిత్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, సూపర్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో దేశాల భద్రతా వ్యవస్థలను పూర్తిగా మార్చనున్నాయని అన్నారు. డేటా, సాంకేతిక వేదికలు, భాగస్వామ్య వ్యవస్థలను అనుసంధానం చేసుకునే దేశాలే మరింత సురక్షితంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

మరోవైపు, నార్త్ మాసిడోనియా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి పాంచే తోష్కోవ్స్కీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ నేర ముఠాలను నిర్వీర్యం చేయడం ద్వారా తమ దేశంలో నేరాల స్థాయిని గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల స్వాధీనం, అవినీతి నిర్మూలన, వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

అంతరించిపోతున్న వన్యప్రాణుల అంతర్జాతీయ వాణిజ్య నియంత్రణ ఒప్పందం (CITES) సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ ఇవోన్ హిగ్యూరో మాట్లాడుతూ.. వన్యప్రాణుల అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరమని, దీనిని అరికట్టేందుకు మూల దేశాల నుంచి రవాణా మార్గాలు, గమ్యస్థానాల వరకు అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

50 శాతం తగ్గింపుతో రిజిస్ట్రేషన్లు

వరల్డ్ పోలీస్ సమ్మిట్ ఐదవ ఎడిషన్‌లో పాల్గొనే ప్రతినిధుల కోసం ప్రస్తుతం డెలిగేట్ పాస్‌లపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ కోసం: https://worldpolicesummit.com/registration/

నవంబర్ 16న సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com