GCC దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం..!!
- November 09, 2026
మనామా: గల్ఫ్ దేశాల మధ్య రైల్వే అనుసంధానానికి సంబంధించి ఆరు GCC దేశాలు కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో జరిగిన GCC రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రుల 30వ సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. మొత్తం 1,768 కిలోమీటర్ల పొడవైన గల్ఫ్ రైల్వే ప్రాజెక్టు అమలుకు అవసరమైన చట్టపరమైన, నియంత్రణపరమైన ఏర్పాట్లను పూర్తి చేసేందుకు ఇది కీలక ముందడుగుగా నిలవనుంది.
బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, ఇతర GCC దేశాల మంత్రులతో కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. GCC సెక్రటరీ జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్ బుదైవీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు ఉమ్మడి అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు.
ఒప్పందంలో ఏముందంతే?
రైల్వే ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, సాంకేతిక సమన్వయానికి సంబంధించి సభ్య దేశాల బాధ్యతలను ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. ఆయా దేశాల్లోని జాతీయ రైల్వే నెట్‌వర్క్‌లను ఒకే గల్ఫ్ రైల్వే వ్యవస్థతో అనుసంధానించేందుకు అవసరమైన విధివిధానాలను కూడా ఇందులో పొందుపరిచారు.
గల్ఫ్ రైల్వే ప్రాజెక్టు వివరాలు
* మొత్తం పొడవు: 1,768 కిలోమీటర్లు
* ప్రయాణికుల రైళ్ల డిజైన్ వేగం: గంటకు 200 కిలోమీటర్లు
* సరుకు రవాణా రైళ్ల డిజైన్ వేగం: గంటకు 80-120 కిలోమీటర్లు
* రైలు సేవల ప్రారంభ లక్ష్యం: డిసెంబర్ 2030
ఈ రైల్వే అందుబాటులోకి వస్తే GCC దేశాల మధ్య ప్రయాణాలు సులభతరం కావడంతోపాటు అంతర్గత వాణిజ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. సరుకు రవాణా, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థల సామర్థ్యం మెరుగుపడనుంది. పర్యాటకం, ఉపాధి అవకాశాల కల్పనకు కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
హార్ముజ్, బాబ్ అల్ మందబ్ మార్గాలపై చర్చ
ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు రవాణా, టెలికమ్యూనికేషన్లు, లాజిస్టిక్స్ రంగాలపై చూపుతున్న ప్రభావాన్ని మంత్రులు చర్చించారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి, బాబ్ అల్ మందబ్ సముద్ర మార్గాల్లో నౌకాయానానికి ఎదురవుతున్న ముప్పులు, సరఫరా వ్యవస్థలపై వాటి ప్రభావం, పెరుగుతున్న రవాణా ఖర్చులపై చర్చించారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అభివృద్ధి చేయడం, ఓడరేవులు, రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాల మధ్య అనుసంధానాన్ని పెంచడంపై దృష్టి సారించారు.
ఈ సమావేశంలో మొత్తం 32 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించారు. గల్ఫ్ రైల్వే పురోగతి, ఉమ్మడి అంతర్జాతీయ భూ రవాణా వ్యవస్థ, సముద్ర రవాణా నిబంధనలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రవాణా రంగాన్ని సిద్ధం చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
సౌదీ, ఖతార్‌లతో ప్రత్యేక ఒప్పందాలు
ఈ సందర్భంగా మరో రెండు అవగాహన ఒప్పందాలు కూడా కుదిరాయి. రైల్వే రంగంలో సహకారానికి సంబంధించి సౌదీ అరేబియాతో, భూ రవాణా, లాజిస్టిక్స్ సేవల్లో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి ఖతార్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాల మార్పిడి, నైపుణ్యాల అభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయి.
కాగా, GCC రవాణా కమిటీ చైర్మన్ బాధ్యతలను బహ్రెయిన్ సౌదీ అరేబియాకు అప్పగించింది. కొత్త బాధ్యతలు చేపట్టిన రియాద్‌కు బహ్రెయిన్ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ నిర్ణయాల అమలులో బహ్రెయిన్ తన సహకారాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ‘లులూ వాలీ దీపావళి 2026’ వేడుకలు..!!
- దుబాయ్ నుంచి మనీలాకు Dh1కే విమాన టికెట్..!!
- సౌదీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల్లో సౌదీకరణ మరింత కఠినతరం..!!
- GCC దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం..!!
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!







