ఐఎండీ 2026 ఏఐ ర్యాంకింగ్స్‌..సత్తా చాటిన సౌదీ..!!

- November 12, 2026 , by Maagulf
ఐఎండీ 2026 ఏఐ ర్యాంకింగ్స్‌..సత్తా చాటిన సౌదీ..!!

రియాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సౌదీ అరేబియా అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (IMD) బుధవారం విడుదల చేసిన IMD వరల్డ్ డిజిటల్ అండ్ ఏఐ ర్యాంకింగ్ 2026లో పలు కీలక విభాగాల్లో సౌదీ అరేబియా ప్రపంచస్థాయి ర్యాంకులు సాధించింది. మొత్తం 70 దేశాల పనితీరును ఈ నివేదిక విశ్లేషించింది.

ఏఐ సంబంధిత సైబర్ భద్రతా ముప్పులపై కంపెనీల అవగాహన, కార్పొరేట్ ఏఐ వ్యవస్థల్లో సున్నితమైన సమాచార పరిరక్షణ అంశాల్లో సౌదీ అరేబియా ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. జాతీయ ఏఐ వ్యూహం అమలు, కంపెనీల్లో ఏఐ వినియోగం, ప్రజలకు ఏఐ సాంకేతికతలు అందుబాటులో ఉండటం వంటి మూడు అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగో ర్యాంకు సాధించింది.

ఏఐ వినియోగం, ఏఐపై ప్రజల్లో విశ్వాసం, ఏఐ సంబంధిత అంశాల నియంత్రణ విధానాలు, కంపెనీల ఏఐ పెట్టుబడుల విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. ఏఐ నైపుణ్యాలు, నగరాల్లో సేవల నాణ్యత మెరుగుపరిచేందుకు ఏఐ వినియోగం, ఏఐ అల్గారిథమ్‌లలో పక్షపాత ధోరణులను తగ్గించేందుకు కంపెనీలు చేస్తున్న ప్రయత్నాల్లో ఏడో ర్యాంకు సాధించింది. ఏఐ సంసిద్ధతలో ఎనిమిదో స్థానం, ప్రైవేట్ రంగ ఏఐ పెట్టుబడుల్లో తొమ్మిదో స్థానం, ఏఐ మరియు మూలధన పెట్టుబడుల విభాగంలో 11వ స్థానాన్ని దక్కించుకుంది.

డేటా, ఏఐ వ్యవస్థల అభివృద్ధి, సాంకేతిక సంసిద్ధతను పెంపొందించడం, వివిధ రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తరించడంలో సౌదీ అరేబియా సాధిస్తున్న పురోగతికి ఈ ర్యాంకింగ్స్ నిదర్శనంగా నిలిచాయని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com