యూఏఈ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

- November 12, 2026 , by Maagulf
యూఏఈ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మలచడానికి కృషి చేస్తున్నారు.

రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా మలచడమే లక్ష్యంగా యూఏఈతో చర్చలు

యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడితో రాయలసీమ ప్రాంతాన్ని అంతర్జాతీయ ఉద్యానవన కేంద్రంగా (గ్లోబల్ హార్టికల్చర్ హబ్) తీర్చిదిద్దే ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన యూఏఈ ప్రతినిధుల ముందుంచారు. ఇప్పటికే ఆ ప్రాంతం నుంచి విదేశాలకు పండ్లు ఎగుమతి అవుతున్న ఉదాహరణలను ప్రస్తావించారు. యూఏఈకి చెందిన ‘సిలాల్’ వ్యవసాయ-ఆహార సంస్థ ఏర్పాటు చేసే ఫుడ్ క్లస్టర్‌లో ఏపీ భాగస్వామి కావాలని ఆహ్వానించడంతో పాటు, చిత్తూరులో దుబాయ్ సంస్థ ‘ఫ్లోర్‌మాస్టర్’ పరిశ్రమ ఏర్పాటు వేగవంతం చేయాలని కోరారు.

మేధో సంపత్తి హక్కుల పెంపునకు ‘వైపో’తో భాగస్వామ్యం

ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (వైపో) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి, ఏపీలో ‘వైపో-ఆంధ్రప్రదేశ్ అకాడమీ’ని ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులకు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, మేధో సంపత్తి హక్కులపై సరైన శిక్షణ అందించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ చేనేత వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌లు సాధించేందుకు వైపో సహకారం కోరారు.

జపాన్‌తో పారిశ్రామిక సహకారం మరియు కీలక ఖనిజాల అన్వేషణ

జపాన్ రాయబారి కీచి ఓనోతో జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అరుదైన ఖనిజాల లభ్యతపై విస్తృతంగా చర్చించారు. పరిశ్రమల ఏర్పాటులో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తూ రాయితీలను పారదర్శకంగా అందిస్తున్నామని సీఎం తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జపాన్ బృందం… రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా అంశంతో పాటు ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ఉక్కు దిగుమతులపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com