ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి, 30 మందికి గాయాలు
- November 12, 2026
18 వాహనాలు, 5 ట్రక్కులు ఢీకొన్న ఘటన.. మంటల్లో చిక్కుకున్న పలు వాహనాలు.. బాధితుల్లో భారతీయులు సహా ఏడు దేశాల పౌరులు
ఫుజైరా: యూఏఈలోని ఫుజైరాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొత్తం 18 వాహనాలు, ఐదు ట్రక్కులు ఈ ప్రమాదంలో చిక్కుకోగా, 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అధికారుల వివరాల ప్రకారం.. ఓ ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ముందున్న మరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనం బోల్తాపడి, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న కారణంగా రహదారిపై నిలిచిన ఇతర వాహనాలను ఢీకొంది. ఈ క్రమంలో ట్రక్కులో మంటలు చెలరేగి, అవి ఇతర వాహనాలకు కూడా వ్యాపించాయి. దీంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డు పై ప్రమాదం
ఫుజైరా సరిహద్దు ప్రాంతంలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్ (E89)పై ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఫుజైరా పోలీసులు తెలిపారు. ఈ రహదారి ఫుజైరా నుంచి షార్జా, రస్ అల్ ఖైమా మీదుగా అబుదాబి వరకు అనుసంధానమై ఉంటుంది.
ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
15 మందికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
ప్రమాదంలో గాయపడిన 30 మందిలో 15 మంది అవసరమైన వైద్య చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 15 మందికి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి చికిత్స కొనసాగుతోంది.
గాయపడిన వారిలో యూఏఈ, ఒమన్, భారత్, బ్రెజిల్, పాకిస్థాన్, జోర్డాన్, ఈజిప్ట్ దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మృతుల్లో ఎమిరేటీ పౌరులు కూడా ఉన్నారని, మరికొందరి గుర్తింపును డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారిస్తున్నట్లు ఫుజైరా పోలీసులు తెలిపారు.
భారతీయులకు అండగా దుబాయ్‌లోని భారత కాన్సులేట్
ఈ ఘోర ప్రమాదంపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు పేర్కొంటూ, బాధిత కుటుంబాలను సంప్రదించినట్లు వెల్లడించింది.
స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొంది.
వదంతులను నమ్మవద్దని అధికారుల సూచన
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు అధికారిక వనరులనే అనుసరించాలని, ధృవీకరించని వార్తలు, వదంతులను ప్రచారం చేయవద్దని సూచించింది.
జూన్‌లోనూ ఘోర ప్రమాదం
యూఏఈలో ఈ ఏడాది చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇది మరో విషాద ఘటన. గత జూన్‌లో దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై సాంకేతిక సమస్య కారణంగా రహదారి మధ్యలో ఆగిపోయిన ట్రక్కును మినీబస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
ప్రాథమిక దర్యాప్తులో ట్రక్కు సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా ఆగిపోయిందని, బస్సు డ్రైవర్ తగినంత దూరం పాటించకపోవడం, రహదారిపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా ఫుజైరా ప్రమాదం యూఏఈలో రహదారి భద్రత, వాహనాల మధ్య తగినంత దూరం పాటించడం, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు
- అబుదాబిలో హోటల్ వద్ద ఘర్షణ..8 మంది అరెస్ట్
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి, 30 మందికి గాయాలు
- దోహాలో రేపు ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మంది విశిష్ట వ్యక్తులకు సత్కారం
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!







