అబుదాబిలో హోటల్ వద్ద ఘర్షణ..8 మంది అరెస్ట్
- November 12, 2026
అబుదాబి: అబుదాబిలోని ఓ హోటల్ ప్రవేశ ద్వారం వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణను వీడియో తీసిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అబుదాబి పోలీసులు వెల్లడించారు.
గతంలో ఉన్న వివాదాల కారణంగానే ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను సంఘటనా స్థలానికి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
ఘర్షణలో పాల్గొన్న ఎనిమిది మందితో పాటు ఘటనను వీడియో తీస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
అబుదాబిలో ప్రజల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, ప్రజా శాంతి భద్రతలకు సహకరించాలని సూచించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా UFC ఫైటర్ల ఘర్షణ వీడియో
ఇదిలా ఉండగా, ప్రముఖ UFC ఫైటర్ మెరాబ్ ద్వాలిష్విలి (Merab Dvalishvili), ఉస్మాన్ నుర్మగోమెడోవ్ (Usman Nurmagomedov) మధ్య జరిగినట్లు చెబుతున్న ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, అబుదాబి పోలీసులు ప్రకటించిన అరెస్టులకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటనకు సంబంధం ఉందా లేదా అనే విషయంపై అధికారిక ధృవీకరణ లేదు.
రియల్ అమెరికన్ ఫ్రీస్టైల్ (RAF) ఈవెంట్ కోసం ఈ ఇద్దరు ఫైటర్లు అబుదాబిలో ఉన్నట్లు సమాచారం. శనివారం బ్రెజిల్‌కు చెందిన మార్లన్ మోరేస్‌తో మెరాబ్ ద్వాలిష్విలి పోటీపడాల్సి ఉంది. మరోవైపు ఉస్మాన్ నుర్మగోమెడోవ్ తన సోదరుడు ఉమర్‌కు మద్దతుగా అబుదాబికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉమర్ ఈ ఈవెంట్‌లో ఉరిజా ఫేబర్‌తో తలపడనున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉస్మాన్ నుర్మగోమెడోవ్ వెనుక నుంచి మెరాబ్ ద్వాలిష్విలి వద్దకు వచ్చి ఏదో మాట్లాడిన అనంతరం అతడిని చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఇరువురు ఫైటర్లతో పాటు వారి అనుచరుల మధ్య ఘర్షణ జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది.
దాడి పై మెరాబ్ ద్వాలిష్విలి ఆగ్రహం
ఘర్షణ అనంతరం మెరాబ్ ద్వాలిష్విలి మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనపై వెనుక నుంచి దాడి చేశారని ఉస్మాన్ నుర్మగోమెడోవ్, అతడి బృందంపై ఆరోపణలు చేశారు.
ముఖం పై గాయాలతో చికిత్స పొందుతున్న సమయంలో మాట్లాడుతూ, వెనుక నుంచి దాడి చేయడం పిరికిపంద చర్య అని విమర్శించారు. నిజంగా పోరాడాలనుకుంటే సరైన పద్ధతిలో ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
అయితే, వైరల్ వీడియోలోని వ్యక్తులే పోలీసులు అరెస్ట్ చేసిన వారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడబోమని అబుదాబి పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు
- అబుదాబిలో హోటల్ వద్ద ఘర్షణ..8 మంది అరెస్ట్
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి, 30 మందికి గాయాలు
- దోహాలో రేపు ఘనంగా ICBF డే 2026 వేడుకలు..19 మంది విశిష్ట వ్యక్తులకు సత్కారం
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
- ఐటీయూ పీపీ-26 సదస్సులో పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు
- దోహా చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని
- అబుదాబిలో Dh14 మిలియన్ల బంగారు ఆభరణాల ఫ్రాడ్.. నిందితుడి అరెస్ట్..!!
- ఖతార్‌లో కొత్తగా 9 మెట్రోలింక్ బస్ రూట్లు…!!
- ఒమన్‌లో సముద్రం అల్లకల్లోలం.. పలు ప్రాంతాల్లో వర్షాలు..!!







