బహ్రెయిన్‌లో జన్యు పరీక్షల దుర్వినియోగానికి అడ్డుకట్ట..!!

- November 13, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో జన్యు పరీక్షల దుర్వినియోగానికి అడ్డుకట్ట..!!

మనామా: బహ్రెయిన్‌లో మానవ క్లోనింగ్ పరిశోధనలు చేపట్టేవారికి కనీసం 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు BD1 మిలియన్ వరకు జరిమానా విధించేలా కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. వ్యక్తుల DNA, జన్యు సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడం, జన్యు ఆధారిత వివక్షకు స్వస్తి పలకడం ఈ ప్రతిపాదిత చట్టం ప్రధాన ఉద్దేశని తెలిపారు.

బహ్రెయిన్ షూరా కౌన్సిల్‌కు చెందిన ఐదుగురు సభ్యులు మొత్తం 40 ఆర్టికల్స్‌తో ఈ బిల్లును ప్రతిపాదించారు. ఇందులో జన్యు పరీక్షలు, జీన్ థెరపీ, వైద్య పరిశోధనలకు సంబంధించిన నిబంధనలను పొందుపరిచారు. ఈ ప్రతిపాదన ప్రకారం మానవ క్లోనింగ్‌కు సంబంధించిన పరిశోధనలు పూర్తిగా నిషేధం. అలాగే వారసత్వంగా సంక్రమించే జన్యు లక్షణాలను అక్రమంగా మార్చడం, ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి హాని కలిగించే జన్యుమార్పిడి జీవులను సృష్టించడం కూడా నేరాలుగా పరిగణిస్తారు. 

ఇక ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు BD100,000 నుంచి BD1 మిలియన్ వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు.

ఉద్యోగ నియామకాల్లో DNA పరీక్షలకు నో

ఉద్యోగ అభ్యర్థులకు భవిష్యత్తులో వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తెలుసుకునేందుకు యజమానులు DNA పరీక్షలు చేయించడం, గతంలో చేసిన జన్యు పరీక్షల ఫలితాల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం లేదా నిరాకరించడం నిషేధించాలని బిల్లులో పేర్కొన్నారు. ఉద్యోగులను బలవంతంగా జన్యు పరీక్షలకు పంపించకూడదు. అయితే వ్యాధుల నివారణ లక్ష్యంగా స్వచ్ఛంద ఆరోగ్య కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది.

బీమా సంస్థలు కూడా పాలసీలు ఇచ్చే ముందు DNA పరీక్షలు చేయించాలని కోరడం లేదా గత జన్యు పరీక్షల ఫలితాల ఆధారంగా బీమా కవరేజీని నిరాకరించడం కుదరదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే BD10,000 నుంచి BD50,000 వరకు జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

జీన్ థెరపీకి అనుమతి

అనుమతించిన వైద్య చికిత్సలు మినహా వ్యక్తుల జన్యువుల్లో మార్పులు చేయడాన్ని నిషేధించాలని ప్రతిపాదించారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కనీసం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు BD100,000 నుంచి BD500,000 వరకు జరిమానా విధించనున్నారు. అయితే జీన్ థెరపీకి అనుమతి ఉంటుంది. ఇందుకోసం రోగి నుంచి ముందస్తు సమాచారంతో కూడిన సమ్మతి తీసుకోవాలి. 

నిపుణులైన వైద్యుల ఆమోదం ఉండాలి. లైసెన్స్ పొందిన ఆరోగ్య కేంద్రాల్లోనే ఈ చికిత్స నిర్వహించాలి. రోగి సమ్మతి లేకుండా జన్యు పరీక్షలు నిర్వహిస్తే BD1,000 నుంచి BD10,000 వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు. 

అయితే, వంశపారంపర్య వ్యాధులను గుర్తించడం, సరైన చికిత్స అందించడం, నవజాత శిశువులకు అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం వంటి వైద్య అవసరాలకు DNA పరీక్షలు కొనసాగుతాయి. నేర పరిశోధనల్లో వ్యక్తులను గుర్తించేందుకు కూడా చట్టపరమైన నిబంధనల ప్రకారం జన్యు ఆధారాలను ఉపయోగించవచ్చు.

జాతీయ జన్యు సమాచార డేటాబేస్

దేశవ్యాప్తంగా జన్యు సమాచారాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక జాతీయ జీనోమిక్ డేటాబేస్ ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ఇందులోని సమాచారాన్ని ఎవరు చూడవచ్చు, ఎలా భద్రపరచాలి, ఇతరులతో ఎలా పంచుకోవాలనే అంశాలపై కఠిన నియంత్రణలు ఉంటాయి.

అలాగే వారసత్వ లక్షణాలు, కుటుంబ నేపథ్యం లేదా జన్యు పరీక్షల ఫలితాల ఆధారంగా వ్యక్తులపై వివక్ష చూపడాన్ని నిషేధించనున్నారు. జన్యు పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ల్యాబొరేటరీలు, సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. అనుమతి లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తే కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు BD10,000 నుంచి BD100,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

ఈ బిల్లును డాక్టర్ జమీలా అల్ సల్మాన్, జమాల్ ఫఖ్రో, డాక్టర్ జెహాద్ అల్ ఫదేల్, దలాల్ అల్ జాయెద్, డాక్టర్ ఎబ్తిసామ్ అల్ దల్లాల్ ప్రతిపాదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com