యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!

- November 13, 2026 , by Maagulf
యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!

దుబాయ్: యూఏఈలో శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్లూ (ఇన్‌ఫ్లుయెంజా) టీకాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆసుపత్రులు, క్లినిక్‌లలో ఫ్లూ వ్యాక్సిన్లు కనిష్ఠంగా Dh69 నుంచే అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన కొంతమంది నివాసితులకు ప్రభుత్వ ఆరోగ్య విభాగం సరఫరా చేసే టీకాలు ఉచితంగా కూడా లభిస్తున్నాయి. అయితే ఆరోగ్య బీమా పాలసీని బట్టి టీకా ఖర్చులను బీమా సంస్థలు భరిస్తాయా లేదా అనేది మారుతుంది.

ఆసుపత్రుల్లో టీకాల ధరలు ఇలా..

దుబాయ్‌లోని ఆస్టర్ క్లినిక్‌లో పెద్దలకు ఫ్లూ టీకా ధర Dh69 కాగా, పిల్లలకు Dh89గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో డాక్టర్ కన్సల్టేషన్, టీకా ఇచ్చే ఛార్జీలు కూడా ఉన్నాయి. పిల్లల ప్యాకేజీలో తప్పనిసరి పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ కూడా చేర్చారు. ఆస్టర్ క్లినిక్ బిజినెస్ బేలో ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రోహిత్ జాకబ్ మాట్లాడుతూ.. ఇటీవలి వారాల్లో ఫ్లూ టీకాలు వేయించుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు టీకాలపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

దుబాయ్‌లోని మెడియోర్ ఆసుపత్రిలో ఫ్లూ వ్యాక్సిన్ ప్యాకేజీ Dh99కు అందుబాటులో ఉంది. అబుధాబిలోని మహమ్మద్ బిన్ జాయెద్ సిటీలో ఉన్న ఎన్‌ఎంసీ రాయల్ ఆసుపత్రిలో ప్రత్యామ్నాయ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ Dh70కు లభిస్తోంది. అయితే ఇది అందుబాటును బట్టి ఉంటుంది.

ఆరోగ్య బీమా వర్తిస్తుందా?

కొన్ని మీడియం, ప్రీమియం స్థాయి ఆరోగ్య బీమా పాలసీల్లో ఫ్లూ టీకాలకు కవరేజ్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది వ్యక్తిగత పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఆస్టర్ క్లినిక్‌లో NAS, Neurone, MetLife ద్వారా నిర్వహించే అర్హత కలిగిన కొన్ని బీమా పాలసీలకు సాధారణంగా ముందస్తు అనుమతి అవసరం ఉండదు. ఇతర బీమా సంస్థల పాలసీలకు టీకా వేయించుకునే ముందు అనుమతి తీసుకోవాల్సి రావచ్చు. మెడియోర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ విష్ణు చైతన్య మాట్లాడుతూ.. కొన్ని బీమా సంస్థలు ఫ్లూ వ్యాక్సినేషన్ ఖర్చులను భరిస్తుండగా, మరికొన్ని సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పించడం లేదన్నారు. టీకా వేయించుకునే ముందు తమ పాలసీలో ఈ ప్రయోజనం ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.

ఇక అబుధాబిలో అర్హత కలిగిన నివాసితులకు, టీకా కోసం బీమా కవరేజ్ లేనివారికి కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సరఫరా చేసే సీజనల్ ఫ్లూ టీకాలు ఉచితంగా లభిస్తున్నాయని ఎన్‌ఎంసీ వైద్యురాలు డాక్టర్ టిట్టీ మేరీ థామస్ తెలిపారు. అయితే ఆసుపత్రి నిబంధనలను బట్టి డాక్టర్ కన్సల్టేషన్, టీకా ఇచ్చే ఛార్జీలు విడిగా వసూలు చేసే అవకాశం ఉందన్నారు.

నవంబర్‌లో టీకా వేయించుకోవడం మంచిది

యూఏఈలో సాధారణంగా సెప్టెంబర్‌లో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఫ్లూ కేసులు పెరుగుతాయని, చల్లని వాతావరణం ఉండే నెలల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో ఫ్లూ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మెడియోర్ వైద్యుడు డాక్టర్ విష్ణు చైతన్య తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడానికి సుమారు రెండు వారాల సమయం పడుతుందని, అందువల్ల నవంబర్‌లోనే టీకా వేయించుకోవడం మంచిదని సూచించారు. జ్వరం వచ్చిన తర్వాత టీకా గురించి ఆలోచించకుండా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలని డాక్టర్ రోహిత్ జాకబ్ సూచించారు. ఫ్లూ వ్యాక్సిన్ అనేది వ్యాధి రాకుండా ముందస్తుగా రక్షణ కల్పించేదే తప్ప, ఇప్పటికే వచ్చిన ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స కాదని స్పష్టం చేశారు.

ఎవరికి టీకా అవసరం?

ఆరు నెలల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ వైద్యపరమైన అభ్యంతరాలు లేనట్లయితే ఏటా ఫ్లూ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు టీకాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ మోడరన్ ఆసుపత్రి (దుబాయ్) ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రేణుకా రామసామి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఫ్లూ టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. ఫ్లూ టీకా వేయించుకుంటే ఫ్లూ వస్తుందనే అపోహ కూడా కొందరిలో ఉందని, అయితే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ ఇన్‌ఫెక్షన్ రాదని ఆమె స్పష్టం చేశారు.

టీకా తీసుకున్నంత మాత్రాన ఫ్లూ పూర్తిగా రాకుండా ఉంటుందని చెప్పలేమని, అయితే తీవ్రమైన అనారోగ్యం, ఇతర సమస్యలు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితుల ముప్పును తగ్గించడంలో వ్యాక్సిన్ సహాయపడుతుందని వైద్యులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com