విమాన సర్వీసుల అంతరాయాల పరిష్కారానికి భారత్, యూఏఈ, ఒమన్ త్రైపాక్షిక కమిటీ

- November 13, 2026 , by Maagulf
విమాన సర్వీసుల అంతరాయాల పరిష్కారానికి భారత్, యూఏఈ, ఒమన్ త్రైపాక్షిక కమిటీ

భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన కార్యకలాపాల సమన్వయానికి కీలక నిర్ణయం.. సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయనున్న మూడు దేశాలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసుల నిర్వహణలో ఎదురవుతున్న అంతరాయాలను పరిష్కరించేందుకు భారత్, యూఏఈ, ఒమన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మూడు దేశాల మధ్య ప్రత్యేక సాంకేతిక త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. విమాన కార్యకలాపాలకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంతో పాటు సమన్వయంతో పరిష్కార మార్గాలను అన్వేషించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.

ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మారీతో ఆయన సమావేశమయ్యారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ గగనతల కార్యకలాపాలపై వాటి ప్రభావం వంటి అంశాలపై ఇరువురు చర్చించారు.

ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. భారత్, యూఏఈ, ఒమన్ దేశాలతో కూడిన సాంకేతిక త్రైపాక్షిక కమిటీ ఏర్పాటుకు అంగీకరించినట్లు తెలిపారు. విమాన కార్యకలాపాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, సమన్వయంతో కూడిన పరిష్కారాలను రూపొందించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ నెలాఖరులో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) మధ్యప్రాచ్య, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల మధ్య జరగనున్న సాంకేతిక చర్చలకు కూడా ఈ సమావేశం మార్గం సుగమం చేసిందని మంత్రి తెలిపారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో విమాన సర్వీసులకు ఆటంకాలు

ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, అనంతరం ఇరాన్ చేపట్టిన ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలు దేశాలు తమ గగనతలంపై ఆంక్షలు విధించడంతో విమానయాన సంస్థలు కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

దీంతో నవంబర్ నెలలో జెడ్డా, రియాద్, దమ్మామ్ సహా పలు నగరాలకు భారత విమానయాన సంస్థలు కొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు దేశాల మధ్య కమిటీ ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

కెనడాతోనూ విమానయాన రంగ సహకారం పై చర్చలు

మరోవైపు, విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతోనూ రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.

భారత్-కెనడా మధ్య పౌర విమానయాన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs), కెనడా విమానయాన పరిశ్రమ మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం, ద్వైపాక్షిక వాణిజ్యానికి అనుగుణంగా ఎయిర్ కార్గో కనెక్టివిటీని బలోపేతం చేయడం, విమానయాన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకార అవకాశాల పై ఇరువురు చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com