ప్రధాని మోదీ చేతుల మీదుగా బెంగళూరు మెట్రో పింక్ లైన్ ప్రారంభం

- November 13, 2026 , by Maagulf
ప్రధాని మోదీ చేతుల మీదుగా బెంగళూరు మెట్రో పింక్ లైన్ ప్రారంభం

బెంగళూరు: బెంగళూరు నగర ప్రజా రవాణా వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. నమ్మ మెట్రో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పింక్ లైన్ ఎలివేటెడ్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఎంపీ తేజస్వి సూర్య, మంత్రి కృష్ణ బైరేగౌడలతో కలిసి ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు. నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి ఈ మార్గంలో సాధారణ ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 7.5 కిలోమీటర్ల మార్గం చేరడంతో బెంగళూరు మెట్రో నెట్‌వర్క్ మొత్తం పొడవు 103.6 కిలోమీటర్లకు చేరనుంది. దీంతో ఢిల్లీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ కలిగిన నగరంగా బెంగళూరు నిలవనుంది.

బెంగళూరులో ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మరింత విస్తరించేందుకు, మెట్రో అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. నగరాన్ని మరింత సమర్థవంతంగా, పర్యావరణహితంగా, ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ.. పింక్ లైన్ ప్రారంభం మెరుగైన అనుసంధానం కలిగిన బెంగళూరు దిశగా మరో ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ సుధా యాదవ్, మంత్రి కృష్ణ బైరేగౌడ, ఎంపీ తేజస్వి సూర్య పాల్గొన్నారని తెలిపారు.

ఏయే ప్రాంతాలను కలుపుతుంది?

కొత్తగా ప్రారంభించిన 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ పింక్ లైన్ కాలేన అగ్రహార నుంచి తావరెకెరె వరకు సుద్దగుంటెపాళ్య మీదుగా సాగుతుంది. బన్నేరుఘట్ట రోడ్డు పరిసరాల నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఈ మార్గం ఉపయోగపడనుంది. ఈ రూట్‌లోని జయదేవ స్టేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ కారిడార్‌తో ఇంటర్‌ఛేంజ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు జయదేవ స్టేషన్‌లో రైలు మారి ఎలక్ట్రానిక్ సిటీ వైపు వెళ్లవచ్చు. అక్కడి నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, జయనగర్, వైట్‌ఫీల్డ్ వంటి ప్రాంతాలకు మెట్రో ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది.

ప్రతి 8 నిమిషాలకు ఒక మెట్రో రైలు
ప్రారంభ దశలో పింక్ లైన్‌పై ప్రతి 8 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడపాలని నిర్ణయించారు. ఈ మార్గం కోసం మొత్తం ఐదు రైళ్లను కేటాయించారు. వీటిలో నాలుగు రైళ్లు ప్రయాణికులకు సేవలు అందించనుండగా, మరో రైలును అత్యవసర అవసరాల కోసం సిద్ధంగా ఉంచుతారు. సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో స్థిరపడిన తర్వాత ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల మధ్య విరామాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు. కొత్త మార్గంలో ప్రయాణ ఛార్జీలపై ఇంకా చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. పింక్ లైన్ అందుబాటులోకి రావడంతో బెంగళూరులో మెట్రో కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. ముఖ్యంగా బన్నేరుఘట్ట రోడ్డు, జయదేవ ఇంటర్‌ఛేంజ్ పరిసరాల్లో ప్రయాణించే వారికి ఈ మార్గం ఉపయోగకరంగా మారనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com