ఫిబ్రవరి 28, నుంచి గల్ఫ్ దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు: జీసీసీ ప్రధాన కార్యదర్శి

- November 14, 2026 , by Maagulf
ఫిబ్రవరి 28, నుంచి గల్ఫ్ దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు: జీసీసీ ప్రధాన కార్యదర్శి

న్యూయార్క్: ఫిబ్రవరి 28, 2026 నుంచి ఇప్పటివరకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్ బుదైవి వెల్లడించారు. ఈ దాడులు సభ్య దేశాల భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

శుక్రవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. గల్ఫ్ దేశాల్లోని కీలక సంస్థలు, పౌర సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారని, మౌలిక సదుపాయాలతో పాటు సముద్ర పర్యావరణానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

జీసీసీ సభ్య దేశాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని అల్ బుదైవి స్పష్టం చేశారు. ఈ దాడులను తక్షణమే నిలిపివేసేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్యలు తీసుకోవాలని కోరారు.

భద్రతా మండలి తీర్మానాల అమలును పర్యవేక్షించాలని, ఆయుధాల నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, దాడులకు బాధ్యులైన వారిని జవాబుదారీగా నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దాడుల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యరాజ్యసమితి సిబ్బంది, మానవతా సహాయ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కూడా ఆయన ఖండించారు.

దాడుల ప్రభావం గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ సముద్ర మార్గాలపై కూడా పడుతోందని అల్ బుదైవి హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం, బాబ్ అల్ మందబ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, చమురు, గ్యాస్ ట్యాంకర్లపై దాడులను తీవ్రంగా ఖండించారు.

అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగించడం లేదా కీలక సముద్ర మార్గాలను మూసివేయడానికి ప్రయత్నించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. సముద్ర మార్గాల్లో అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా, తీవ్రమైన మానవతా సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

గల్ఫ్ దేశాలు సంక్షోభాల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలకే ప్రాధాన్యత ఇస్తాయని ఆయన తెలిపారు. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారాన్ని గుర్తించడం, పొరుగు దేశాలతో సత్సంబంధాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి సూత్రాల ఆధారంగా సంబంధాలు కొనసాగాలని పేర్కొన్నారు.

గల్ఫ్ దేశాల భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించేలా, వాటి ప్రయోజనాలకు సంబంధించిన చర్చల్లో ఆయా దేశాలకు భాగస్వామ్యం కల్పించేలా ఒప్పందాలు ఉండాలని అల్ బుదైవి స్పష్టం చేశారు.

చివరగా, జీసీసీ దేశాలపై, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను తక్షణమే, ఎలాంటి షరతులు లేకుండా నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల నాయకుల మార్గదర్శకత్వంలో శాంతి, మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. అరేబియా గల్ఫ్ భద్రత అనేది అంతర్జాతీయ భద్రతలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com