టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
- November 14, 2026
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.
గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయన 1946 జూన్ 8న ఉమ్మడి ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే నాటకాలు, కళారంగంపై ఉన్న మక్కువతో ఆయన సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో ఆయన నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్ ప్రారంభంలో కథానాయకుడిగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆ తర్వాత ప్రతినాయకుడిగా (విలన్), హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి తనదైన ప్రత్యేక బాడీ లాంగ్వేజ్, నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.
చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో గిరిబాబు 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు వంటి అగ్ర కథానాయకులందరితోనూ కలిసి నటించిన అరుదైన అనుభవం ఆయన సొంతం. 1977లో వచ్చిన పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’లో దుశ్శాసనుడి పాత్రలో ఆయన కనబరిచిన నటన ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయింది. ఆ తర్వాత జ్యోతి, మెరుపు దాడి, పసివాడి ప్రాణం, బాలగోపాలుడు, హలో బ్రదర్, సిసింద్రి, లిటిల్ సోల్జర్స్, చంద్రలేఖ, నువ్వే కావాలి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి తరం హీరోల చిత్రాల్లోనూ నటించి ఆయన మెప్పించారు. మహేశ్ బాబు నటించిన ‘అతడు’ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా ఆయన చేసిన నటనకు విశేష ఆదరణ లభించింది. అలాగే గమ్యం, అ ఆ, గీత గోవిందం, డిస్కో రాజా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, జాతి రత్నాలు వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో చివరి వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
దర్శకుడిగా, నిర్మాతగా విశేష సేవలు..
గిరిబాబు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘రణరంగం’ (1985), ‘ఇంద్రజిత్’ (1990), ‘నీ సుఖమే నే కోరుతున్నా’ (2008) వంటి చిత్రాలు తెరకెక్కాయి. అలాగే ‘మెరుపు దాడి’, ‘దేవతలారా దీవించండి’ వంటి పలు విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. గిరిబాబుకు ముగ్గురు సంతానం కాగా, పెద్ద కుమారుడు రఘుబాబు టాలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా కొనసాగుతున్నారు. గిరిబాబు అర్ధాంగి శ్రీదేవి 2018లో కన్నుమూశారు. గిరిబాబు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ భేటీ
- టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
- బహ్రెయిన్ సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు..!!
- ఎడారులను పచ్చదనంగా మార్చేందుకు సౌదీ కొత్త ప్రణాళిక..!!
- కువైట్‌లో వ్యవసాయ ఉత్పత్తి 12.65 శాతం తగ్గుదల..!!
- ఒమన్‌లో ఆహార భద్రతకు భారీ ప్రోత్సాహం..!!
- ఖతార్ – టర్కియే మధ్య కీలక రక్షణ ఒప్పందం..!!
- షార్జా, రస్ అల్ ఖైమా బీచ్‌లలో సందర్శకుల సందడి..!!
- సౌదీ అరేబియా విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- నాలుగు గంటలకు పైగా నిలిచిపోయిన అమెరికా విమాన సర్వీసులు..







