బహ్రెయిన్‌లో హై అలర్ట్.. దేశవ్యాప్తంగా భద్రతా హెచ్చరికలు జారీ..

- November 15, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో హై అలర్ట్.. దేశవ్యాప్తంగా భద్రతా హెచ్చరికలు జారీ..

మనామా: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతా హెచ్చరిక (Nationwide Threat Alert) జారీ చేసింది. ఆదివారం ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులు, నివాసితులు ప్రశాంతంగా ఉండాలని, వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారాన్ని అధికారిక సమాచార మార్గాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

అయితే, ఈ హెచ్చరికకు సంబంధించిన ముప్పు స్వరూపం ఏమిటి? ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారనే విషయాలను మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.
అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు?
ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరించే సబరీన్ న్యూస్ టెలిగ్రామ్ ఛానల్ కథనం ప్రకారం.. బహ్రెయిన్‌లో ఇరాన్ డ్రోన్ దాడుల కారణంగా వరుసగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై ఇరాన్ డ్రోన్ దాడి జరిగిందని ఆ ఛానల్ పేర్కొంది. పేలుళ్ల శబ్దాలు ఇంకా వినిపిస్తున్నాయని తెలిపింది.

అయితే, ఈ దాడులకు సంబంధించిన వివరాలను బహ్రెయిన్ అధికారులు స్వతంత్రంగా ధృవీకరించలేదు.

గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్‌లో తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు పలు ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి.

తాజా భద్రతా హెచ్చరికతో బహ్రెయిన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com