ఒమన్‌లో పర్సనల్ స్టేటస్ చట్టంలో కీలక నిబంధనలు..!!
- November 15, 2026
మస్కట్: ఒమన్‌లో భార్య, పిల్లల మెయింటెనెన్స్ బాధ్యతలకు సంబంధించి పర్సనల్ స్టేటస్ చట్టం కీలక నిబంధనలను నిర్దేశిస్తోంది. రాయల్ డిక్రీ 32/97 ద్వారా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం భార్యాభర్తలు, పిల్లల పోషణ బాధ్యతలు, వాటికి సంబంధించిన అర్హతలు, న్యాయపరమైన అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు.
పోషణ ఖర్చుల్లో ఏమేం ఉంటాయి?
వ్యక్తి జీవించడానికి అవసరమైన ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య చికిత్సతో పాటు సంప్రదాయ పద్ధతుల ప్రకారం అవసరమైన ఇతర ఖర్చులన్నీ మెయింటెనెన్స్ పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు. భరణం ఎంత చెల్లించాలనే విషయాన్ని నిర్ణయించేటప్పుడు చెల్లించే వ్యక్తి ఆర్థిక స్థోమత, పోషణ పొందే వ్యక్తి పరిస్థితి, అప్పటి ఆర్థిక పరిస్థితులు, ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు.
భార్య పోషణ భర్త బాధ్యత
చట్టబద్ధమైన వివాహ ఒప్పందం కుదిరిన తేదీ నుంచే భార్య పోషణ బాధ్యత భర్తపై ఉంటుందని డాక్టర్ అల్ జద్జాలి తెలిపారు. భార్యకు సొంత ఆదాయం లేదా ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ భర్త ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేరని వివరించారు. భార్యాభర్తల పరిస్థితులకు తగిన నివాసాన్ని కూడా భర్త ఏర్పాటు చేయాలి.
అయితే సరైన కారణం లేకుండా భార్య భర్తతో కలిసి ఉండేందుకు నిరాకరించినా, వైవాహిక ఇంటికి వెళ్లకపోయినా, ఇంటిని విడిచిపెట్టినా, భర్తను ఇంట్లోకి రానివ్వకపోయినా లేదా సముచిత కారణం లేకుండా భర్తతో ప్రయాణించేందుకు నిరాకరించినా భరణం పొందే హక్కు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భార్య కోర్టులో భరణం కోసం దావా వేసే తేదీకి ముందు గరిష్ఠంగా ఒక సంవత్సరం కాలానికి సంబంధించిన మెయింటెనెన్స్ ను మాత్రమే పొందవచ్చని, అయితే భార్యాభర్తలు పరస్పరం వేరే విధంగా అంగీకరించుకోవచ్చని తెలిపారు.
పిల్లల మెయింటెనెన్స్ తండ్రి బాధ్యత
ఇక, మైనర్ పిల్లలకు సొంత ఆస్తులు లేకపోయినా, ఉన్న ఆస్తులు వారి అవసరాలకు సరిపోకపోయినా వారి పోషణ బాధ్యత తండ్రిపైనే ఉంటుంది. ఈ బాధ్యత కుమార్తెకు వివాహం జరిగే వరకు, కుమారుడికి తన వయసు వారిలా సంపాదించి జీవించగలిగే వయసు వచ్చే వరకు కొనసాగుతుంది. అయితే కుమారుడు చదువును కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తుంటే అతని మెయింటెనెన్స్ బాధ్యత కూడా తండ్రిపై కొనసాగుతుంది.
తండ్రి ఆచూకీ తెలియకపోయినా, ఆయనకు ఆస్తులు లేకపోయినా లేదా మెయింటెనెన్స్ ఖర్చులు భరించే స్థోమత లేకపోయినా, పిల్లల బాధ్యత తీసుకోగలిగే సంరక్షకుడు ఎవరూ లేనప్పుడు ఆర్థిక స్థోమత ఉన్న తల్లి పిల్లల మెయింటెనెన్స్ బాధ్యతను చేపట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
తల్లి పాలివ్వలేకపోతే పాల ఖర్చులూ తండ్రివే
తల్లి బిడ్డకు పాలివ్వలేని పరిస్థితి ఉంటే, ప్రత్యామ్నాయంగా పాలివ్వించే ఖర్చులను తండ్రే భరించాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది.
ఒకవేళ పోషణ ఖర్చుల కోసం బాధ్యత వహించే వ్యక్తి అందరి అవసరాలను తీర్చలేని పరిస్థితి ఉంటే, చెల్లింపుల్లో ప్రాధాన్యత క్రమం ఇలా ఉంటుంది. మొదట భార్య, ఆ తర్వాత పిల్లలు, తల్లిదండ్రులు, ఇతర బంధువులకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కోర్టులో కేసు వేయడానికి ముందున్న ఆరు నెలల కాలానికి సంబంధించిన పిల్లల భరణాన్ని కూడా తండ్రి నుంచి ఇప్పించే అధికారం న్యాయమూర్తికి ఉంటుంది.
విడాకుల సమయంలోనూ మెయింటెనెన్స్ తప్పనిసరి
విడాకుల అనంతరం భార్యకు ఇద్దత్ (విడాకుల తర్వాత నిర్దిష్ట నిరీక్షణ కాలం) సమయంలో చెల్లించాల్సిన భరణం, పిల్లల పోషణ ఖర్చులను న్యాయమూర్తి నిర్ణయిస్తారు. సంబంధిత వ్యక్తులు కోరినప్పుడు ఈ ఉత్తర్వులు జారీ చేస్తారు. వీటిని వేగంగా అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉన్న సమయంలో భార్య, పిల్లల పోషణకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశించవచ్చని డాక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం అల్ జద్జాలి వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో విదేశీ డ్రైవర్లకు షాక్..!!
- ఒమన్‌లో పర్సనల్ స్టేటస్ చట్టంలో కీలక నిబంధనలు..!!
- ద్వైపాక్షిక సహకారంపై సౌదీ–అమెరికా చర్చలు..!!
- యూఏఈ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారత రాయబారి..!!
- ఖతార్‌లో పాస్‌పోర్టు, ఐడీ కార్డులు పోగొట్టుకున్నారా?
- శాంతి స్థాపనలో యూఎన్ఓ మిషన్ల పాత్ర కీలకం: కువైట్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ భేటీ
- టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
- బహ్రెయిన్ సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు..!!
- ఎడారులను పచ్చదనంగా మార్చేందుకు సౌదీ కొత్త ప్రణాళిక..!!







