ద్వైపాక్షిక సహకారంపై సౌదీ–అమెరికా చర్చలు..!!

- November 15, 2026 , by Maagulf
ద్వైపాక్షిక సహకారంపై సౌదీ–అమెరికా చర్చలు..!!

రియాద్: సౌదీ అరేబియా, అమెరికా దేశాలు హౌసింగ్, పట్టణ ప్రణాళిక, రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు చర్చలు జరిపాయి. అమెరికాలోని వర్జీనియాలో జరిగిన గ్లోబల్ సదస్సు సందర్భంగా సౌదీ మున్సిపాలిటీలు, గృహనిర్మాణ శాఖ మంత్రి మాజిద్ అల్ హొగైల్.. అమెరికా గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి స్కాట్ టర్నర్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గృహ నిర్మాణాన్ని పెంచడం, ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ విధానాలను అభివృద్ధి చేయడంపై ఇరువురు చర్చించారు. అలాగే గృహనిర్మాణ సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచి మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పించడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.

సాంకేతిక సహకారం, నైపుణ్యాల మార్పిడి, పరస్పర పర్యటనల కోసం ప్రత్యేక సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేసే అంశం కూడా చర్చకు వచ్చింది. తద్వారా సౌదీ, అమెరికా సంస్థల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. సదస్సులో మాట్లాడిన మంత్రి మాజిద్ అల్ హొగైల్.. సౌదీ అరేబియా గృహ రుణాల రంగాన్ని అభివృద్ధి చేస్తూ, రియల్ ఎస్టేట్ రుణాలను దీర్ఘకాలిక మూలధన మార్కెట్లతో అనుసంధానిస్తోందని తెలిపారు. దీనివల్ల మార్కెట్ స్థిరత్వం పెరగడంతో పాటు తక్కువ ధరలకు ఇళ్లను అందించే అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పైగా రీఫైనాన్స్ లక్ష్యం

సౌదీ రియల్ ఎస్టేట్ రీఫైనాన్స్ కంపెనీ (SRC) 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పైగా రీఫైనాన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వెల్లడించారు. అలాగే సెక్యూరిటైజేషన్, గ్యారెంటీలు, డేటా నిర్వహణ, ఆధునిక క్రెడిట్ రిస్క్ టెక్నాలజీల రంగాల్లో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు.

సౌదీలో గృహాలకు దీర్ఘకాలిక డిమాండ్ కొనసాగుతోందని, పారదర్శక నియంత్రణ వ్యవస్థలో భాగంగా ఫైనాన్సింగ్, గ్యారెంటీ, రుణ సేవల విధానాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ వ్యవస్థను సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA), క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు.

సౌదీ గృహనిర్మాణ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు ముందుకు రావాలని, కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు దీర్ఘకాలిక స్థిరమైన రాబడులు అందించే భాగస్వామ్యాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com